తని ఒరువన్ సినిమాలో అరవింద్ స్వామిదే కీ రోల్. ఆ టైపు పాత్రలో అరవింద్ స్వామిని చూడడం తమిళ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. దానికి తగ్గట్టు స్టైలీష్ విలన్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు అరవింద్ స్వామి. అందుకే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు అరవింద్ స్వామి కంటే మంచి ఆప్షన్ చరణ్‌కీ, సురేందర్ రెడ్డికీ దొరకలేదు. భారీ పారితోషికం ఇచ్చి అరవింద్ స్వామిని ధృవ కోసం తీసుకొన్నది అందుకే. ట్రైలర్లలో చరణ్ కంటే అరవింద్ స్వామినే స్టైల్‌గా కనిపిస్తున్నాడు. సినిమాలోనూ చరణ్‌ని అరవింద్ స్వామి క్యారెక్టర్ డామినేట్ చేసిందని, చరణ్ హీరోయిజం ఎలివేట్ అవ్వడానికి చివరి క్షణాల్లో అరవింద్ స్వామి పాత్రకు కటింగులు చేశారని, దాంతో అరవింద్ స్వామిని తొక్కేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై దర్శకుడు సురేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు.
”తమిళంలో కంటే స్ట్రాంగ్ గా తెలుగులో అరవింద్ స్వామి పాత్ర ఉంటుంది. హీరోయిజం కోసం ఆయన పాత్రని పాడు చేయలేదు. ధృవ సినిమాకి అసలైన హీరో.. కథే. అది నచ్చే చరణ్ ఈ సినిమా ఒప్పుకొన్నాడు. హీరోయిజం ఎక్కడ పండించే అవకాశం ఉందో.. అక్కడ ఆ పాత్రని ఎలివేట్ చేశాం. కాబట్టి.. హీరోయిజం లేదన్న మాటే లేదు” అని క్లారిటీగా చెప్పేశాడు సూరి. అరవింద్ స్వామి ధృవలో నటించడానికి ముందు ఒప్పుకోలేదని, ఆయన్ని బలవంతంగా ధృవలో లాక్కొచ్చారని గుసగుసలు వినిపించాయి. దీనిపైనా ఆయన స్పందించాడు. ”ధృవ కోసం అరవింద్ స్వామిని కలిసినప్పుడు ‘మార్పులూ చేర్పులూ ఏమైనా చేస్తారా’ అని అడిగారు. నేను కొద్దిపాటి మార్పులు సూచించా. అది అరవింద్ స్వామికి బాగా నచ్చాయి. ఒకే ఒక్క రోజు వ్యవధిలో ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చార”న్నాడు సూరి. సో.. ధృవ సినిమాపై రేగుతున్న పుకార్లకు పుల్ స్టాప్ పడిపోయినట్టే.