తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఒక దశలో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగిందనీ, ఆ క్రెడిట్ అంతా నారా లోకేష్‌కు దక్కుతుందని కూడా దేశం నేతలు ప్రచారం చేసుకున్నారు. సరే, ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తం చేయడం… సంఖ్య పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది! అయితే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే… లోకేష్ ఎఫెక్ట్‌తో అమెరికాలో కూడా సభ్యత్వ నమోదు అమాంతంగా పెరిగిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి! అయితే, అది టీడీపీలో కాదు… తానాలో! అదేనండీ.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం!
తానాకి ఓ ఇమేజ్ ఉంది! ఆంధ్రాలో ఏ పార్టీ అధికారంలో ఉంటే… ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తడం తానా కమిటీ సభ్యులకు అలవాటైపోయిందన్న విమర్శ ఒకటుంది. ఎందుకంటే, అధికార పార్టీకి అండగా ఉంటే ఏవో కొన్ని పదవులు దక్కే అవకాశం ఉంటుంది కదా! సరే, ఆ విమర్శల్ని కాసేపు పక్కన పెడితే.. ఈ మధ్యనే తానా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందట. ఈ క్రమంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణికి తానా సభ్యత్వం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సింధూ అనే మహిళ రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. నాలుగు దశాబ్దాల చరిత్రగల తానాకు ఇంతవరకూ పదివేల మంది సభ్యులు ఉంటే.. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే 5 వేల మందికి కొత్తగా సభ్యత్వం ఎలా ఇవ్వగలిగారు అంటూ ఆమె ఆ లేఖ ద్వారా తానాని ప్రశ్నించారు. కొత్తగా సభ్యత్వాలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా, సభ్యత్వం ఇస్తున్నవారి గురించి ఎంక్వయిరీలు లాంటివి ఉండవా అంటూ ఆమె నిలదీశారు.
లోకేష్ దంపతుల విషయంలో నిబంధనల్ని తుంగలోకి తొక్కి సభ్యత్వాలు ఇచ్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అధికార పార్టీని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతోనే అడ్డగోలుగా తానా సభ్యత్వాలు ఇలా కట్టబెట్టేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ఆమె తానా కమిటీ సభ్యులను కోరారు. సభ్యత్వ పంపకాల వెనక చినబాబు ప్రమేయం కూడా ఉందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి, సింధు రాసిన ఈ లేఖపై తానా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ ఆరోపణలపై లోకేష్ స్పందించే అవకాశం ఉందంటారా!