తలపాగ చుట్టడం చేతగాక, తల ఒంపు తిరిగి ఉందన్నాడట వెనకటికో పెద్ద మనిషి! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు కూడా ఇలానే ఉంటున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం పోతుందన్నారు. అది నెల రోజుల కిందటి మాట! ఇప్పుడేమో నగదు రహిత విధానాలను ప్రోత్సహించడానికే పెద్ద నోట్లను రద్దు చేశామంటున్నారు. ఇది పరిస్థితుల ప్రభావంతో మారిన మాట! ఆర్బీఐ జారీ చేసిన నగదు అంతా బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో వచ్చేస్తోంది. అంటే, బ్లాక్ మనీ దేశంలో లేనట్టేనా..? చెలామణిలో ఉన్న కరెన్సీ అంతా ఖాతాల్లోకి వచ్చేస్తుంటే… నల్లధనం ఎక్కడున్నట్టు..? ఇంకోపక్క… దేశంలో సామాన్యుడికి బ్యాంకుల్లో రూ. 2 వేలు దొరకడం లేదు. కానీ, కొంతమంది బడాబాబుల దగ్గరకు కోట్ల రూపాయల కొత్త నోట్లు చేరుతున్న వైనాన్ని చూస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందనే లోక్సభ సమావేశాలకు కూడా ప్రధాని రావడం మానేశారు. అయితే, ఆయన రాకపోవడానికి కారణం ప్రతిపక్షాలే అనే కొత్త వాదన వినిపించడం విచిత్రం, విడ్డూరం!
పార్లమెంటులో ఆయన మాట్లాడకపోవడానికి కారణం ప్రతిపక్షాలే అని ప్రధాని మోడీ చెప్పారు! లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనీ, అందుకే జనసభల్లో మాట్లాడుతున్నానని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసమే పెద్ద నోట్లను రద్దు చేశానని చెప్పుకొచ్చారు. డబ్బు కోసం ప్రజలు బ్యాంకుల ముందు నిలబడాల్సిన పనిలేదన్నారు! ఎందుకంటే, బ్యాంకులే ప్రజల దగ్గరకి వచ్చేశాయనీ, ఈ-బ్యాకింగ్ సేవల్ని అందరూ వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు తనను మాట్లాడనివ్వడం లేదని ప్రధాని అన్నారు!
లోక్సభలో ప్రధాని మాట్లాడితే అడ్డుకునేంత బలం, బలగం ప్రతిపక్షాలకు ఎప్పుడైనా ఉంటుందా..? చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఉన్నాయా..? అయినా, ప్రతిపక్షాలు ఏం కోరుతున్నాయి..? ప్రధాని లోక్సభకు రావాలనీ, మాట్లాడాలనీ. సభకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నది ఆయనే! ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేయడం అనేది మోడీ స్థాయికి సరిపడా వ్యాఖ్య కాదనేది పలువురి అభిప్రాయం. మొత్తానికి, పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీర్చడంలో సర్కారు పూర్తిగా ఫెయిల్ అయిందనే తత్తరపాటు మోడీ వ్యవహార శైలిలో కూడా స్పష్టంగా కనిసిస్తోంది.