తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన మూలాలు ఉన్నాయని ఆ మధ్య చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి మోడీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ నాయకులు పార్టీ కోసం పాటుపడాలని స్ఫూర్తి నింపారు. అదే సందర్భంలో నాయకుల మధ్య సమన్వయ లోపాన్నీ, సీనియర్లలో కొరవడుతున్న కలుపుగోలు తనంపై కూడా క్లాస్ తీసుకున్నారు. అయితే, ఆ మాటలు ఎవరిపై ఎంతవరకూ పనిచేశాయన్న చర్చ పక్కన పెడితే.. రేవంత్రెడ్డి మాత్రం తన ధోరణిలో తాను ముందుకు సాగిపోతున్నారు. వరుస యాత్రలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
తాజాగా విద్యార్థి పోరు అనే కార్యక్రమం తలపెట్టారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇంజినీరింగ్ కళాశాలల మూసివేత వంటి సమస్యలపై కేసీఆర్ సర్కారును నిలదీయడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం! ఇంతకుముందే రైతు పోరు అనే కార్యక్రమం చేపట్టి… రాష్ట్రంలోని రైతుల సమస్యలపై గట్టి వాణి వినిపించారు. అయితే, రేవంత్ యాత్రలపై తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం!
అదేంటీ… రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసమే కదా రేవంత్ ఈ పోరాటాలు చేస్తున్నారు..! దాన్లో అసంతృప్తి చెందాల్సిన అంశం ఏముందని అనిపించొచ్చు! కానీ, ఆయన ఒక్కరే పోరాటం చేస్తుండటమే సమస్య! రైతు పోరుగానీ, తాజా విద్యార్థి పోరుగానీ ఇతర నేతలతో సంబంధంతో లేకుండా సోలోగా రేవంత్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంటే అంతా తానే అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి కొంతమందిలో ఉందట! ఆయన నిర్వహిస్తున్న యాత్రలూ పోరాటాల గురించి తమతో చర్చించరనీ, నచ్చినట్టు చేస్తుంటారని పార్టీ నేతలే కాస్త గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
అయితే, ఈ పరిస్థితిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేద్దామనుకున్నా… ఇది సరైన సమయం కాదని కాస్త వెనకడుగు వేస్తున్నారట. ఎందుకంటే, టి. దేశం సీనియర్ నేతలపై ఇప్పటికే చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఫిర్యాదులు అంటే ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో అని కాస్త వెనకడుగు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా ఇదే అసంతృప్తి వ్యక్తమౌతోందనీ, పార్టీ కోసం పాటుపడేందుకు తమకు అవకాశం దక్కనీయకుండా చేస్తున్నారనీ, గుర్తింపు రానీయకుండా అడ్డుకుంటున్నారే అభిప్రాయం వ్యక్తమౌతోందట! ఇంతకీ… రేవంత్ చేస్తున్న పోరాటాలు పార్టీ కోసమా… తన కోసమా…?