ఫిరాయింపుల దెబ్బకి విపక్ష వైకాపా విలవిలలాడిన మాట వాస్తవమే. వైకాపా టికెట్‌పై గెలిచి, తెలుగుదేశం పంచన చేరినవారితో పార్టీ పరంగా వైకాపాకి కొంత డామేజ్ జరిగింది. పైగా, వరుస ఫిరాయింపులతో పార్టీ శ్రేణుల్లో కూడా ఒకింత నిరుత్సాహ వాతావరణం నెలకొంది. ఎందుకంటే, ఉన్న నాయకుల్ని నమ్మాలా వద్దా అనే గందరగోళం కిందిస్థాయిలో బాగా ఉంది. పైగా, ఇలా వైకాపా నుంచి ఎవరైనా బయటకి వెళ్తున్న ప్రతీ సందర్భంలోనూ జగన్ నుంచి వెలువడుతున్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాలకు ఒకింత అసంతృప్తి మిగుల్చుతూనే ఉండేది! ఉన్నవాళ్లు ఉంటారు.. పోయేవాళ్లు పోతారు అనే మొండి వైఖరిని అధినాయకత్వానిది. ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీకి వచ్చిన నష్టమేం లేదన్నట్టుగా సంకేతాలు వెలువడుతూ ఉండేవి. అయితే, ఇప్పుడు పార్టీలో ఆ పరిస్థితులు మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ వైకాపా నుంచి బయటకి వెళ్లిపోయిన నేతల గురించే వింటూ వచ్చాం. కానీ, ఇప్పుడు వైకాపాలోకి చేరేందుకు కూడా ఇతర పార్టీ నుంచి నేతలు వస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ వర్గాల్లో ఒకింత ఉత్సాహం నెలకొంది.
వైకాపాలో చేరేందుకు పలువురు నేతలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి తనయుడు కాసు మహేష్, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌లు వైకాపాలో చేరుతున్నారు. విజయవాడ వెస్ట్ మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. శ్రీనివాస్ కూడా వైకాపాలోకి వస్తున్నారు. ఏపీలో భాజపా పరిస్థితి మరీ దారుణంగా ఉందనీ, తెలుగుదేశం పార్టీకి భాజపా దాసోహం అయిపోయిందని శ్రీనివాస్ ఈ సందర్భంగా విమర్శించారు. చంద్రబాబు పాలన దారుణంగా ఉందనీ, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనీ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటం చేయాలన్న ఉద్దేశంతోనే తాను వైకాపాలో చేరుతున్నా అని అప్పారు.
అయితే, వైకాపాలోకి వస్తున్నవారు ఎమ్మెల్యేలూ ఎంపీల స్థాయి నాయకులు కాకపోవచ్చు కానీ, వైకాపాలోకి రావడం అంటూ ఒకటి మొదలైంది కదా! ఎందుకంటే, ఇన్నాళ్లూ పార్టీ నుంచి అవుట్ గోయింగ్ తప్ప, పార్టీలోకి ఇన్కమింగ్ లేదు కదా! నిరుత్సాహం నిండిన వైకాపా వర్గాలకు ఈ మాత్రం మార్పు నూతనోత్తేజాన్ని నింపుతోందని చెప్పాలి. సమీప భవిష్యత్తులో మరింత నేతలు వైకాపాలోకి రాబోతున్నారన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి వైకాపా వర్గాలు. కొంత కాలంగా డీలా పడిపోయిన పార్టీ వర్గాలకు తాజా చేరికలతో కొంత ఊరట లభిస్తుందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో మరికొంతమంది కీలక నేతలు వైకాపాలో చేరితే పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహం రావడం ఖాయమని చెప్పొచ్చు.