చిత్రసీమలోనే కాదు.. ఏ రంగంలో నిలదొక్కుకోవాలన్నా ప్రతిభ మాత్రమే సరిపోదు. అణుకువ కూడా అవసరం. ఎంత ఎత్తుకు ఎదిగితే అంతగా ఒదిగి ఉండాల్సిందే. అప్పుడు విజయం మనకు సలాం కొడుతుంది. అయితే కొంతమంది నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు… విజయ ‘గర్వం’ ప్రదర్శిస్తూ, కాలర్ ఎగరేస్తుంటారు. తమ పతనానికి అదే నాంది అనే విషయం మర్చిపోతున్నారు. అందుకే.. వాళ్ల కెరీర్ వాళ్లకు తెలియకుండానే రివర్స్ గేర్‌లో కి వెళ్లిపోతోంది. అందుకు తాజా ఉదాహరణ నిత్యమీనన్. దక్షిణాదికి దొరికిన అరుదైన కథానాయిక నిత్య. హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమాత్రం లేని నటి.. నిత్య. అందం, గ్లామర్ ఈ విషయంలో ఇప్పటి హీరోయిన్లతో పోలిస్తే… నిత్య చాలా దూరంలో ఉంటుంది. అయితే ఆమె ప్రతిభ… నిత్యకు ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చాయి. అద్భుతమైన, అత్యంత సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొంది నిత్య. కేవలం తనని చూడ్డానికి.. తన నటనని ఆస్వాదించడానికి జనాలు థియేటర్‌కి వెళ్తారంటే ఆమె ఎంతలా మెస్మరైజ్ చేయగలదో అర్థమవుతుంది. అలాంటి నిత్య కెరీర్ ఇప్పుడు తిరోగమన దిశలో ప్రయాణిస్తోంది. చేసిన సినిమా ఫ్లాప్ అవ్వడమో.. ఒక వేళ హిట్ అయినా నిత్య వల్ల ప్రత్యేకంగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేకపోవడం కనిపిస్తూనే ఉన్నాయి. కథల ఎంపికలో చాలా తెలివిగా వ్యవహరిస్తుందన్న గుడ్ టాక్ కూడా… మాయమైపోతోంది.
దానికి తోడు నిత్య ఆటిట్యూడ్… సినీ లోకాన్ని విస్మయపరుస్తోంది. సెట్లో, బయటా ఆమె ప్రవర్తన పెదవి విరిచేలా, నిత్యపై పెంచుకొన్న ప్రేమ.. పటాపంచలు అయ్యేలా చేస్తోంది. దాంతో ఆమె అవకాశాలు కనుమరుగవుతున్నాయి. ‘నిత్య మంచి నటే.. కానీ.. ఆమెను భరించడం కష్టం’ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. చెప్పిన సమయానికి నిత్య సెట్‌కి రాదని, ‘వన్ మోర్’ అని దర్శకుడు అడిగినా… `నేనెందుకు చేయాలి?` అని వితండవాదానికి దిగుతోందని, నిత్య వ్యక్తిగత వ్యవహారాలు, ఆమె ఇష్టాఇష్టాలూ సెట్లో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని ఇలా ఆమెపై రకరకాల అభియోగాలు. అందుకే.. నిత్యకు ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. సావిత్రి సినిమాకి తననే కథానాయిక అనుకొన్నారు. ఆ స్క్రిప్టు ఆమెకు బాగా నచ్చింది కూడా. సావిత్రి పాత్రకు నిత్య బాగా సెట్టయిపోతుంది. అయితే అంతా ఓకే అనుకొన్న తరుణంలో కేవలం.. నిత్య ఆటిట్యూడ్ వల్లే ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సివచ్చింది, ఆ స్థానంలో సమంత వచ్చి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కథానాయికలు పారితోషికం విషయంలో, సెట్లో సౌకర్యాల కోసమో గొడవ పడతారు. కానీ నిత్య మాత్రం సెట్లో తన ఆధిపత్యం చూపించుకోవడానికి తహతహలాడుతుందని, అదే… దర్శక నిర్మాతలకు మింగుడుపడని విషయాలని.. ఆమెకు సన్నిహితంగా చూసినవాళ్లు చెబుతున్నారు. మరి ఈ ఆటిట్యూడ్‌ని ఎప్పుడు మార్చుకొంటుందో ఏంటో..!
వెండి తెరపై క్యూట్ గా కనిపించే నిత్య.. నిజ జీవితంలోనూ అంత క్యూట్‌గా మారితే ఎంత బాగుండునో..?!