మంచు విష్ణు కంటే తమ్ముడు మనోజ్‌కే మాస్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. దానికి తోడు యాక్షన్ ఎంటర్టైన్లను ఎక్కువగా ఎంచుకొంటాడు మనోజ్. ఇప్పుడు చేస్తున్న గుంటూరోడు కూడా అలాంటి సినిమానే. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. టీజర్ ఈరోజే బయటకు వచ్చింది. సినిమా పూర్తిగా మాస్ కి నచ్చేలా తీర్చిదిద్దారన్న విషయం షాట్స్, డైలాగ్ చూస్తుంటే అర్థమైపోతోంది. అయితే… ‘కొడితే ఒంట్లో ఉన్న 206 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతాయ్ నా కొడకా’ లాంటి ఊర మాస్ డైలాగులే ఎక్కువగా ఉన్నాయి. డైలాగుల్లో కొత్తదనం లేదు. మాస్‌ని టార్గెట్ చేయడమే ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. దానికి తోడు.. టీజర్లో ‘సరైనోడు’ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. సరైనోడు టీజర్లో వినిపించే ఆర్.ఆర్.., సుత్తి పట్టుకొనే షాట్ ఇవన్నీ ‘గుంటూరోడు’ ఫాలో అయిపోయినట్టు అనిపిస్తోంది. మనోజ్ బాగా ఒళ్లు చేయడం, మనోజ్ తప్ప ఇంకెవ్వరికీ టీజర్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇందులోని మైనస్‌లు. అయితే టేకింగ్ పరంగా క్వాలిటీ కనిపిస్తోంది. ఊర మాస్ సినిమాకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. పైగా ఈమధ్య కేవలం మాస్‌ని టార్గెట్ చేసిన సినిమా రాలేదు. అవి… గుంటూరోడుకు ప్లస్ పాయింట్లు. చిత్రీకరణ పూర్తి చేసుకొన్న గుంటూరోడు 2017 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్దమయ్యాడు. మరి మాస్‌ని ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. శౌర్య, ఎటాక్ సినిమాలతో ఫ్లాపుల మీదున్న ఈ మంచు హీరోని గుంటూరోడే ఆదుకోవాలి.