చిత్రసీమ ఇప్పుడు కొత్త టెక్నిక్ నేర్చుకొంది. టైటిళ్ల విషయంలో ఆయా హీరోల అభిమానుల అభిప్రాయాన్ని తెలుసుకొనే విషయంలో ‘ఫీలర్లు’ వదలడం నేర్చుకొంది. ‘ఆ సినిమా టైటిల్ ఇది కావొచ్చు’ అంటూ ఓ ఫీలర్ వదిలి.. ఆ టైటిల్ గురించి ఫ్యాన్స్ ఏం మాట్లాడుకొంటున్నారో గమనించి, పాజిటీవ్ వైబ్రేషన్లు వచ్చిన టైటిల్‌ని ఫిక్స్ చేయడం మెల్లి మెల్లిగా అలవాటు అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు – మురుగదాస్ సినిమా విషయంలో ఇదే జరుగుతోందనిపిస్తోంది. చిత్రీకరణ పూర్తి కావొస్తున్నా, ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ విషయంలో చిత్రబృందం ఓ క్లారిటీకి రాలేకపోతోంది. ఏజెంట్ శివ, అభిమన్యుడు, వాస్కోడగామా… ఇలా చాలా రకాల పేర్లు వినిపించాయి. ఇప్పుడు సంభవామి అనే టైటిల్ చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్ ని నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించడంతో మహేష్ సినిమా టైటిల్ ఇదే అంటూ ఫ్యాన్స్ కూడా ఫిక్సయిపోయారు. అయితే ఇప్పుడు చిత్రబృందం అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం మొదలెట్టింది.
సంభవామి అనే టైటిల్ ఎలా ఉంది?? ఈ టైటిల్ గురించి ఫ్యాన్స్ ఏం మాట్లాడుకొంటున్నారు? అనే విషయంపై చిత్రబృందం ఫోకస్ పెట్టింది. అయితే.. ఈ టైటిల్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా లేరన్న విషయాన్ని చిత్రబృందం గ్రహించిందని సమాచారం. మురుగదాస్ టైటిళ్లు పవర్‌ఫుల్‌గా ఉంటాయని, అది `సంభవామి`లో కనిపించడం లేదని చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారట. ఇప్పటి వరకూ బయటకు వచ్చిన టైటిళ్లలో ఏజెంట్ శివనే బాగుందని ఫీడ్ బ్యాక్ అందించారట. దాంతో చిత్రబృందం టైటిల్ విషయంలో పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. టైటిల్‌ని ప్రకటించడానికి మురుగదాస్ దగ్గర డిసెంబరు 31 వరకూ టైమ్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని జనవరి 1న విడుదల చేయనుంది చిత్రబృందం. అదే రోజున టైటిల్‌ని ప్రకటిస్తారు. కాబట్టి ఈలోగా ‘సంభవామి’, ‘ఏజెంట్ శివ’ల కంటే బెటర్ టైటిల్‌ని వెదికిపట్టుకోవొచ్చు. మరి మురుగదాస్ మైండ్‌లో ఏముందో?? మహేష్ ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్‌కి ఎంత విలువ ఇస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.