లెజెండ్ సినిమాతో జగపతిబాబు జాతకమే మార్చేశాడు బోయపాటి శ్రీను. ఫ్యామిలీ హీరోని ప్రతినాయకుడిగా చూపించి… తెలుగు ఆడియన్స్‌కి షాక్ ఇచ్చాడు. లెజెండ్ హిట్లో జగ్గూది కీలక పాత్ర. ఆతరవాత విలన్‌గా రెచ్చిపోయాడు జగపతి. పక్కరాష్ట్రాలకు వెళ్లి తన విలనిజం చూపించి వస్తున్నాడు. కోటి రూపాయల ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నాడు. అయితే ఒకటే సమస్య. జగపతి నటనలో రొటినిజం కనిపిస్తోంది. ప్రతీ సినిమాలోనూ ఒకటే గెటప్పు.. ఒక్కటే సెటప్పు. ఇప్పుడు దాన్ని మార్చబోతున్నాడు బోయపాటి శ్రీను. అవును.. లెజెండ్ తరవాత మళ్లీ బోయపాటి – జగపతి కాంబో సెట్టయ్యింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి. ఇందులో ఓ కీలకమైన పాత్రకు జగపతిబాబుని తీసుకొన్నాడు.
లెజెండ్‌తో జగ్గూభాయ్‌ని ఎంత కొత్తగా ప్రజెంట్ చేశాడో.. ఈసారీ అంతే కొత్తగా చూపించబోతున్నాడట. జగపతి గెటప్, మేకొవర్ సరికొత్తగా ఉంటాయని, ఈ సినిమాతో జగపతిబాబు కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల జగపతితో బోయపాటి ఫొటో షూట్ కూడా చేశాడట. ఈ పాత్ర నచ్చి.. తమిళ సినిమాకి ఇచ్చిన కాల్షీట్లను పక్కన పెట్టి.. బోయపాటికి ప్రొసీడ్ అవుతున్నాడట జగపతిబాబు. ”రొటీన్ పాత్రలతో జగపతిబాబు విసిగిపోయారు. ఇప్పుడు మరోసారి.. కొత్త టచ్ ఇవ్వబోతున్నాడు బోయపాటి. ఈ సినిమాతో.. జగపతిబాబులోని సరికొత్త యాంగిల్ బయటకు వస్తుంది..” అంటున్నారు జగపతిబాబు సన్నిహితులు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. మరి శరత్‌కుమార్, జగపతిబాబులో విలన్ ఎవరన్నది తేలాల్సివుంది.