హీరోల కొడుకులు హీరోలవుతారు. దర్శకుల వారసులూ హీరోలవుతారు. కమెడియన్ల కుమారులూ.. మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చేస్తారు. హీరోయిన్ల కుటుంబం నుంచి ఎందుకు రాకూడదు? బహుశా రకుల్‌ప్రీత్ సింగ్ ఇలానే ఆలోచించి ఉంటుంది. అందుకే తన సోదరుడు అమన్‌ని హీరో చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. రకుల్ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్. మహేష్ బాబు నుంచి సాయిధరమ్ తేజ్ వరకూ.. ఏ సినిమాలో చూసినా, ఎవరి పక్కన చూసినా కథానాయికగా తనే కనిపిస్తోంది. దానికి తోడు వరుస హిట్లు. పరిశ్రమతో పరిచయాలూ ఎక్కువే. వీటన్నింటినీ బేస్ చేసుకొని అమన్ ని హీరోగా లాంచ్ చేయాలని ఫిక్సయిపోయింది. ఆల్రెడీ కొంతమంది నిర్మాతలతో రకుల్ సంప్రదింపులు జరుపుతోందని టాక్. `వెనుక నేనుంటా.. మా తమ్ముడి బాధ్యత మీరు చూసుకోండి` అంటూ ప్రపోజల్స్ పెడుతోందట రకుల్. అయితే ఇదంతా గాసిప్పులు మాత్రం కాదు. నిజమే. ఈ విషయాన్ని రకుల్ కూడా అంగీకరించింది.
తెలుగు 360.కామ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది. అమన్‌ని హీరో చేస్తున్నారట కదా? అని అడిగితే ‘అవును’ అంటూ నిక్కచ్చిగా సమాధానం చెప్పేసింది. ”అవును.. వాడికి నటనంటే, సినిమాలంటే చాలా ఇష్టం. తన మనసులోని మాట నాకు చెప్పాడు. తనని ప్రోత్సహించడం నా ధర్మం అనుకొంటున్నా. అందుకు తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి” అంటోంది రకుల్. సో… రకుల్ సోదరుడు కూడా హీరోగా వచ్చేస్తున్నాడన్నమాట. హీరోల లిస్టులో మరో అంకె చేరిపోతున్నట్టే. మరి అమన్ తొలి సినిమాకి దర్శకుడు ఎవరో, నిర్మాతగా రకుల్ ఎవరిని రంగంలోకి దింపుతుందో చూడాలి.