ఏ సినిమాలో దమ్ముందో తెరపై బొమ్మ పడేంత వరకూ తెలీదు. బళ్లు ఓడలయ్యేది.. ఓడలు బళ్లయ్యేది రిలీజ్ తరవాతే తేలుతుంది. సినిమా కొనడం.. లాటరీ టికెట్ కొనడం రెండూ ఒక్కటే. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరి టికెట్కు బంపర్ ఆఫర్ వస్తుందో చెప్పలేం. ఒక రకంగా సినిమాని మించిన జూదం ఎక్కడా ఉండదు. వస్తే.. డబ్బులే డబ్బులు. పోతే అప్పులే అప్పులు. కమెడియన్ నుంచి హీరోగా మారిన శ్రీనివాసరెడ్డి సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’కి మంచి బజ్ వచ్చింది. సినిమాలో విషయం ఉన్నట్టే అనిపించింది. దాంతో ఈ సినిమాని రూ.7 కోట్లకు ఏక మొత్తంగా కొనేశాడు ఓ నిర్మాత. సినిమా కూడా బాగానే ఉంది. కానీ.. ఏం లాభం? ఏడు కోట్లలో సగమంటే సగం కూడా తిరిగి రాలేదు.
మంచి టాకే వచ్చినా… ‘పెద్ద నోట్ల రద్దు’తో అల్లాడిపోతున్న జనం ఈ సినిమా వైపు చూళ్లేదు. దాంతో వసూళ్లు బాగా డల్ అయిపోయాయి. ‘ఈరోజు కాకపోతే రేపు ఫుల్స్ అవుతాయిలే’ అని ఎదురుచూసినవాళ్లంతా ఫూల్స్ అయ్యారంతే! టోటల్గా ఈ సినిమా తో రూ.4 కోట్ల వరకూ నష్టాలొచ్చి ఉండొచ్చన్నది టాక్. ఈసినిమాని ముందే అమ్ముకొన్న నిర్మాత సేఫ్గా, లాభాలతో బయటపడిపోతే.. ఈ సినిమాని నమ్ముకొన్న బయ్యర్ మాత్రం నిండా మునిగిపోయాడు. కమెడియన్ సినిమా అంటే.. ఇప్పుడు సీరియస్ గా అటువైపు చూడడమే మానేస్తారేమో? ఈనెల 23న సప్తగిరి ఎక్స్ ప్రెస్ రిలీజ్ అవుతోంది. మరి ఆయనేం చేస్తాడో. దానికీ దాదాపుగా రూ.8 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్టు సమాచారం.