చిన్న సినిమా, యూత్ సినిమా, యంగ్ ఏజ్ సినిమా… అంటే కాస్త భయం పట్టుకొంటోంది. బహుశా… ఈ పేరు చెప్పి, అందులో బూతు జొప్పించి, చివర్లో నీతులు వల్లించి మేమేదో సమాజాన్ని ఉద్ధరించడానికే ఈ సినిమా తీశామని డబ్బా కొట్టి మరీ పంపింస్తాన్న భయం కావొచ్చు. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి నీతికి బూతు కోటు వేసి చూపించడం ఒక్కటే మంచి మార్గం అని చాలామంది నమ్ముతున్నారు. ఇలా తీస్తే తప్ప చిన్న సినిమా గట్టెక్కద్దు అనేది చిత్ర రూపకర్తల నమ్మకం కావొచ్చు. `అమీర్ పేటలో` ట్రైలర్లు చూస్తుంటే నిజంగానే ఇది కూడా బూతు టైపు సినిమానే అనిపించింది. కానీ థియేటర్లోకి వెళ్తే వేరే దృశ్యం కనిపించింది. అదేంటి? ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఔత్సాహికులు చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకూ ఆకట్టుకొంది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాలి.
* కథ:
వివేక్ (శ్రీ), బిర్యాని బిట్టు (తిలక్), లింగు (సాయి), వెంకట్రావు (రాజు).. వీళ్లంతా తమ ఊరినీ, తల్లితండ్రుల్ని వదిలి ఉద్యోగాల వేటలో అమీర్ పేట వస్తారు. ఇక్కడికి వచ్చింది ఉద్యోగం కోసమే అయినా వేసే వేషాలు వేరు. వివేక్కి సినిమా హీరో అవ్వాలన్నది కల. లింగు ఓ అమ్మాయిని పటాయించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. బిట్టు బిర్యానీలు తింటూ, బీర్లు తాగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. అలా ఒకొక్కరిదీ ఒక్కో దారి. వివేక్కి వెన్నెల (అశ్వని) పరిచయం అవుతుంది. డేటింగ్ పేరుతో దగ్గరై.. వెన్నెలతో ‘ఆ అనుభవం’ రుచి చూద్దామనుకొంటాడు వివేక్. వెన్నెల మనస్తత్వం పూర్తిగా వేరు. వివేక్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకొంటుంది. వెన్నెల వల్ల వివేక్… వివేక్ వల్ల మిత్రబృందం ఎలా మారారు? వీళ్లంతా సమాజానికి ఏం చేశారు? అనేదే కథ.
తెలుగు 360 విశ్లేషణ
మారుతి తీసిన ఈ రోజుల్లో, బస్ స్టాప్ల ప్రభావం ఈ సినిమాపై చాలా ఉంది. ఎందుకంటే చెప్పదలచుకొన్న విషయం మంచిదైనా దానికి కాస్త మసాలా జోడించడం అవసరమని ఈ కథ కూడా నమ్మింది. ప్రారంభ సన్నివేశాలు చూస్తే అదే అనిపిస్తుంది. అమ్మాయిలంతా కలసి మందు కొట్టడం, అబ్బాయిలు అమ్మాయిల్ని ఎలా పడేద్దామా అని ఆలోచించడం, టీవీలో రొమాంటిక్ దృశ్యాలుచూసి అమ్మాయి మెలికలు తిరిగిపోవడం, బాయ్ ఫ్రెండ్స్‌ని వాడుకొని వదిలేయాలి అంటూ నీతి సూత్రాలు వల్లించడం, పార్క్‌లో పొదలు ఊగిపోతుంటడడం.. ఇవన్నీ చూస్తే కచ్చితంగా ఇది బూతు సినిమానే అనిపిస్తుంది. అయితే.. మెల్లిగా కథలోకి, అసలు పాయింట్లోకి వెళ్లాడు దర్శకుడు. `అనాథ` ఎపిసోడ్‌తో జల్సాల రుచి మరిగిన యువతరం దృష్టి కోణంలో మార్పు రావడం… సమాజానికి చేయూత నివ్వడం ఇవ్వన్నీ తెరపై కనిపించేసరికి ఈ సినిమాపై ఏర్పరచుకొన్న అభిప్రాయం మారుతుంది. సాధారణంగా యూత్ కథల్లో.. ముందు చూపించాల్సిన బూతు చూపించేసి – ఆఖర్లో `ఇది తప్పురా నాయినా` అంటూ ఒక్క మాటలో తేల్చేస్తారు. కానీ ఈ కథలో ఆ జ్ఞానోదయం కాస్త తొందరగానే కలగడంతో `బూతు సినిమా` అనే ముద్ర నుంచి తప్పించుకొంది `అమీర్ పేటలో`.
అయితే అమీర్ పేటలో డిస్కర్స్ చేసిన పాయింట్లు చాలా చాలా ఉన్నాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా తమ కంట్రోల్లోకి తెచ్చుకొంటారో.. ఓ జంట కథతో చెప్పారు. ఫేక్ రెజ్యూమ్‌లతో ఉద్యోగాలు సంపాదించిన సాప్ట్ వేర్ ఉద్యోగుల సాధకబాధకాలది మరో ఎపిసోడ్. ఇంట్లో పద్దతిగా పెరిగిన అమ్మాయిలు తల్లితండ్రులకు టోకరా ఇచ్చి.. జల్సాలకు అలవాటు పడిన ఎపిసోడ్ ఇంకోటి. అనాథ పిల్లలకు సేవ చేయాలన్న ధ్యేయం మరోటి. దాంతో పాటు సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలన్న అంకం మరోటి. ఇలా.. చాలా చాలా చర్చించాలనుకొని, దేనికీ పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. కుర్రాళ్లలో మార్పు వచ్చిన సన్నివేశం కూడా బలంగా లేదు. ఆ మాటకొస్తే.. ప్రతి సన్నివేశమూ అసంపూర్ణంగానే ఉంది. నటీనటులంతా కొత్తవాళ్లే. పైగా తక్కువ బడ్జెట్‌తో తీసిన చిత్రం. ఆ లోపాలు కనిపిస్తున్నాయి. నిర్మాణ పరంగా నాశిరకంగా ఉంది. షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి క్వాలిటీతో తెరకెక్కుతున్న ఈ తరుణంలో… ఓ ఫీచర్ ఫిల్మ్ ఇంత తక్కువ క్వాలిటీతో తీసుకురావడం నేరమే. ఇంతా పోగేస్తే అనాథ పిల్లలకోసమో, సమాజం కోసమే వీళ్లు చేసేది.. ఫ్లకార్డులు పట్టుకొని తిరగడమే. దాంతో సమాజం ఏం మారిపోతుందో అర్థం కాదు. తండ్రులు తమ కూతుర్లను ఎంతలా నమ్ముతారో.. చెప్పే సన్నివేశం మాత్రం హాట్ టచింగ్‌గా ఉంటుంది. అలాంటి సీన్లు ఇంకో రెండు మూడు పడితే.. ఈసినిమాపై గౌరవం పెరుగుదును.
* నటీనటులు – సాంకేతిక వర్గం
హీరో, హీరోయిన్లతో సహా అంతా కొత్తవారే. కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ ఈ సినిమాలో కనిపించారు. సహజత్వం కోసమో, లేదంటే కాస్టింగ్‌కి డబ్బులు పెట్టే ఉద్దేశం లేకో…. తనకు దొరికిన నటీనటుల్ని అందరినీ ఈ సినిమా కోసం వాడేశాడు దర్శకుడు. దాంతో ప్రధాన పాత్రలు కూడా అలవాటు పడడానికి టైమ్ పడుతుంది. హీరోనే దర్శకుడు, నిర్మాత కావడంతో ఆయన్నేం అనలేం. శ్రీ ఏం చేసినా… ఏం చేయకపోయినా `సినిమా అంతా ఆయనది.. ఆయనిష్టం` అంటూ సర్దుకుపోవాల్సిందే. హీరోయిన్ పనీ పాటా లేకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. సీరియస్ సీన్ అయినా ఆమె మొహంలో నవ్వు చెరగలేదు. మిగిలిన నటీనటుల నటన, వాళ్ల ఎంపిక షార్ట్ ఫిల్మ్స్ కాస్టింగ్, వాళ్ల యాక్టింగ్ కంటే పది అడుగులు వెనకే ఉంది. కాస్టింగ్ పరంగా, టేకింగ్‌పరంగా జాగ్రత్తలు తీసుకొంటే.. ఈ సినిమా అవుట్ పుట్ ఇంకో స్థాయిలో ఉండేది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం పాడుకొన్న పాట.. బాగుంది. అమీర్ పేటలో పాటలో పదాలు వినిపించలేదు. బ్యాక్ గ్రౌండ్ గీతం ఒకటి ఆకట్టుకొంటుంది.
* ఫైనల్ టచ్: అమీర్ పేటలో అద్భుతాలేం చూపించలేదు. ఔత్సాహికులు చేసిన ఓ చిన్న ప్రయత్నం మాత్రమే.
తెలుగు360 రేటింగ్: 2/5