నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే చాలాసార్లు చెప్పారు. ప్రజలందరూ ఉన్నపళంగా క్యాష్ లెస్ వైపు మళ్లిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. దాన్లో భాగంగానే డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తామన్నారు, ఫోన్ బ్యాంకింగ్ నేర్చేసుకోవాలని చెప్పారు! అంతేకాదు, ఏపీలో నగదు రహిత లావాదేవీలను మందుబాబులు తొందరగా ఎడాప్ట్ చేసుకున్నారని మురిసిపోయారు. వారినే ఆదర్శంగా తీసుకుని నగదు రహితం అలవాటు చేసుకోవాలని ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలకు తెలుగుదేశం సర్కారు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో చంద్రబాబు తీరు చూస్తేనే అర్థమౌతుంది. ఇక, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం!
ఉన్నపళంగా నగదు రహితం అంటే ప్రజలు ఏమైపోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇప్పటికిప్పుడే స్వైపింగ్ మెషీన్లు, డెబిట్ కార్డులూ జారీ చేసి, వాటి ద్వారానే లావాదేవీలు జరపాలనుకోవడం విపరీత పరిణామాలకు దారి తీసేలా ఉందన్నారు. నగదు రహిత లావాదేవీలు ప్రజలపై బలవంతంగా రుద్దేయడం మంచిది కాదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ఆలోచన మంచిదే అయినా ఆచరణలో చాలా సమస్యలు ఉన్నాయని కూడా చెప్పారు. పెద్ద కరెన్సీ నోట్లను ఉన్నపళంగా రద్దు చేయడంతో ఆక్సిజన్ తీసేసినట్టు అయిపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు.
క్షేత్రస్థాయి వాస్తవాలనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ, అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ నేతలు మాత్రం వీటి గురించి మాట్లాడరు! నగదు రహితం అద్భుతః అంటూ చంద్రబాబు అభిప్రాయాలకు తాళం వేస్తుంటారు. ఏదేమైనా మళ్లీ మరోసారి తన రెండు నాల్కల ధోరణిని తెలుగుదేశం బయటపెట్టుకుంటోందని చెప్పాలి. ఆంధ్రాలో నగదు రహితం సూపర్ అంటున్నారు! ఎందుకంటే, అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి. తెలంగాణకు వచ్చేసరికి.. అబ్బబ్చే ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారండీ అని చెబుతున్నారు. ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి! ఇక్కడ నగదు రహితాన్ని ప్రోత్సహిస్తున్న కేసీఆర్ను వ్యతిరేకించాలి కాబట్టి!