ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు, వాటిని యథాతథంగా అమలు చేయడం సాధ్యమా కాదా అనే ఆలోచనలు ఉండవు! అధికారంలోకి వచ్చాక… ఆ హామీలకు కొత్త అర్థాలు వెతుక్కుంటూ, అమలు చేయలేని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నానా తంటాలూ పడుతూ ఉండటం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే తప్పించుకుని తిరుగుతోంది! ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తామంటూ ప్రకటించేశారు. నిరుద్యోగ యువత కూడా అదే ఆశతో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయింది. ఆ హామీ గురించి తీరిగ్గా ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలుగుదేశం యువనేత నారా లోకేష్. ‘ఇంటికో ఉద్యోగం’ అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఓ జాబ్ మేళాలో లోకేష్ ఈ వివరణ ఇచ్చారు.
తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇంటికో ఉద్యోగం అని హమీ ఇచ్చిందంటే దానర్థం వేరు అని చెబుతున్నారు! ఇంటికో ఉద్యోగం అంటే ప్రభుత్వం ఉద్యోగాలు మాత్రమే కావని లోకేష్ వివరించారు. వచ్చే ఉద్యోగం ప్రైవేటుది కావొచ్చు, లేదా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పొందే ఉపాధి అవకాశం కూడా కావొచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జరిగే ప్రకటనలు కూడా ఈ హామీ అమలు కిందకే వస్తాయని చెప్పారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. సుపరిపాలన అందిస్తామన్న నమ్మకం ఉండబట్టే ప్రజలు తమకు అధికారం ఇచ్చారనీ, తాము ఎక్కడికీ పారిపోవడం లేదని అన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పారు. గడచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పునాదుల వల్ల లక్షకుపైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం విశేషం!
నిజమే, పునాదులు, శంకుస్థాపనలు చేసిన మాట వాస్తవమే. కానీ, వాటి వల్లనే ఉద్యోగాలు ఎలా వచ్చాయో లోకేష్ ఇంకాస్త క్లియర్గా చెప్పి ఉంటే బాగుండేది. నిరుద్యోగ భృతి గురించి చెప్పాలంటే… హామీ ఇచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు దాటిపోయింది. దీన్ని అమలు చేస్తారన్న నమ్మకం నిరుద్యోగులకే లేదు. నిరుద్యోగ భృతి ఇప్పట్లో ఇవ్వలేమని గతంలో ఓ మంత్రిగారు కూడా చెప్పారు కదా! నిరుద్యోగ భృతిని ఇవ్వాలంటే కొంత అధ్యయనం చేయాల్సి ఉందని గతంలో అన్నారు. ఇచ్చిన హామీలపై అధ్యయనానినీ, కొత్త నిర్వచనాల వెతుకులాటకీ ఐదేళ్లు సమయం పడితే… అమలు జరిగేది ఎప్పుడు..? మొత్తానికి, ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చేసినట్టు లోకేష్ క్లారిఫై చేసేశారు! రాష్ట్రంలో యువత కొత్తగా ఏ చిన్న పనిలో చేరినా అది తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన ఉద్యోగంగానే భావించాలన్నమాట!