వడ్డించేవాడు మనవాడే అయితే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు! అలాగే, ప్రశ్నలు అడిగేవారు మనవారే అయితే ప్రెస్మీట్లో ఏది మాట్లాడినా చెల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మీడియా విషయంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉందనే చెప్పాలి. ఎందుకంటే, ఆయన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నించేవారే ఉండరు! ఒకవేళ అలా ఉన్నవారున్నా… ప్రశ్నించే అవకాశం రానివ్వరు! ఎంతసేపూ.. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులన్నీ అద్భుతః అని భజన చేసేవారే ఎక్కువైపోయారు. అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! అన్ని చోట్లా చంద్రబాబు మనసెరిగి ప్రశ్నించేవారు ఉండరు కదా. వాస్తవాలను ప్రస్థావించేవారు కూడా ఉంటారు కదా. సరిగ్గా అలాంటి ఓ సందర్భమే చంద్రబాబును ఇరకాటంలో పడేసింది.
ఇండియా టుడే సదస్సులో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతోపాటు తమిళనాడుకు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ కొన్ని అంశాలపై ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మోడల్ స్టేట్‌గా మార్చుతాననీ, టెక్నాలజీ వినియోగంతోపాటు అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర రాజ్‌దీప్ ఓ ప్రశ్న వేశారు. ‘అవినీతిని అంతమొందిస్తామంటున్నారు… మరి, ఏపీలో అప్పోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా! బ్రేక్ పార్టీ, మేక్ పార్టీ అన్నట్టుగా రాష్ట్రాన్ని పునర్మిస్తారా?’ అనేసరికి చంద్రబాబు ముఖం మారిపోయింది.
ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా… తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని సమాధానం చెప్పారు. తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు చాలా ఉన్నారంటూ తనపై నమ్మకంతో వెంట వస్తున్నారని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాజధాని భూసేకరణ అద్భుతంగా జరుగుతోందనీ, అవినీతి రహితంగానే అమరావతి నిర్మిస్తున్నామని చెప్పారు. మొత్తానికి, ఇలాంటి ప్రశ్నలు ఎదురౌతాయని ఆయన ఊహించి ఉండరు! ఎందుకంటే, ఎంతసేపూ ఆయన్ని ఖుషీ చేసే ప్రశ్నలనే వినీవినీ ఉన్నారు కదా. ఏదైమైనా, అవినీతి రహిత రాష్ట్ర నిర్మాణం అని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. బాగానే ఉంది! కానీ, ఫిరాయించిన ఎమ్మెల్యేలను చట్ట ప్రకారమే తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నామని చంద్రబాబు ధైర్యంగా చెప్పలగరా అనేది సూటి ప్రశ్న.