జేసీ దివాకర్‌రెడ్డి పేరుకు మాత్రమే తెలుగుదేశం పార్టీ నాయకుడు అనిపిస్తారు! కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చేసి చాలాకాలం అయిపోయినా… ఇంకా అక్కడి లక్షణాలను వదులుకోలేకపోతున్నారని చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఏ ఇతర నాయకులకూ లేని వాక్ స్వాతంత్ర్యం ఆయనకే ఉంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటకు ఎదురు చెప్పేంత సీన్ పార్టీలో నాయకులెవ్వరికీ ఉండదని అంటారు. అలాంటిది, జేసీ మాత్రం చంద్రబాబు నాయుడుపై ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేసేస్తూ ఉంటారు. ఆ మధ్య పార్టీలో తనకు గుర్తింపు లేదని వాపోయారు. పయ్యావులకే గుర్తింపు లేకపోతే తన గురించి ఎందుకు మాట్లాడుకోవాలన్నారు! పార్టీ కోసం నిజాయతీగా పనిచేసేవారికి కాకుండా, క్యాష్ పార్టీలను చంద్రబాబు ప్రోత్సహిస్తారని కూడా జేసీ విమర్శించిన సందర్భాలున్నాయి. నిజానికి, చంద్రబాబు గురించి జేసీ మాట్లాడారూ అంటే.. విమర్శలే ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మధ్య ఈ స్టైల్‌ను పూర్తిగా మార్చేశారు!
చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబును ఇంప్రెస్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. వైయస్ రాజారెడ్డి మాదిరిగానే జగన్‌కు కూడా తగాదాలంటేనే ఇష్టమని జేసీ విమర్శించారు. పులివెందుల ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఎంతో చేస్తుంటే చూసి ఓర్వేలకపోతున్నాడు అన్నారు. తాను అసలు సిసలైన రెడ్డిని అనీ, రెడ్లంతా ఒకటైతే పోటీలు ఎందుకు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను రతనాల సీమ చేస్తున్నారంటూ ముంచెత్తారు! ఇలా జగన్ గురించి జేసీ విమర్శలు గుప్పిస్తూ మాట్లాడుతూ ఉంటే.. చంద్రబాబు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నిలబడే ఉన్నారు.
అయితే, జేసీ తీరు ఇలా మారడంపై తెలుగుదేశం నేతలే అనుమానంగా మాట్లాడుతున్నారు! జేసీ పొడగ్తలకు పడిపోతే.. ఏదో ఒకరోజు మళ్లీ చంద్రబాబును ఆయనే కిందనపడేసి చెడామడా విమర్శించేస్తారని టీడీపీ నేతలే ఆఫ్ ద రికార్డ్ అనుకుంటూ ఉండటం విశేషం! మొత్తానికి, చంద్రబాబును ఖుషీ చేసే పనిలో జేసీ ఉన్నారు! జేసీ నిజాలే మాట్లాడుతూ ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా! ఆ లెక్కన చంద్రబాబును విమర్శించిన సందర్భాలకూ ఈ వ్యాఖ్యను వర్తింపజేసుకోవచ్చా..?