తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏకైక ఫైర్‌బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఫిరాయింపుల పుణ్యమా అని టీ.తెలుగుదేశం చాలావరకూ ఖాళీ అయిపోయింది. తెలంగాణ తెలుగుదేశం శాఖపై అధినేత చంద్రబాబు నాయుడుకి ఆసక్తి కూడా కాస్త తగ్గిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ టీటీడీపీని ఫామ్‌లో తీసుకురావాలన్నట్టుగా ఈ మధ్యనే చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి తన బాణీని కాస్త మార్చుకుని, అధికార పార్టీ తెరాసపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శల తీరు కొంతమంది ఆంధ్రా తెలుగుదేశం నేతలకు నచ్చడం లేదట! ఆయన వాడే పదజాలం మార్చుకోవాలనీ, లేదంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందని మండిపడుతున్నట్టు సమాచారం!
ఇంతకీ, రేవంత్ మార్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే… ఆంధ్రా అనే మాట! కేసీఆర్‌ను ఇరుకున పెట్టడం కోసం ఎప్పటికప్పుడు ఆంధ్రా అనే పేరుతో రేవంత్ విమర్శలు చేస్తుంటారు. ఈ మధ్యనే క్రీడాకారిణి సింధుకు కేసీఆర్ సర్కారు నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రేవంత్ ప్రస్థావిస్తూ.. తెలంగాణ క్రీడాకారులకు ఈ మేర ప్రోత్సాహం ఎందుకు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. అలాగే, వివిధ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రా ఇంజినీర్లకు, కాంట్రాక్టర్లకూ కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రేవంత్ అంటుంటారు. ఈ మాటలే ఆంధ్రా దేశం నేతలకు కోపం తెప్పిస్తున్నాయట.
తెలంగాణ టీడీపీ నేతలకు ఎన్నో కీలక పదవులను పార్టీ ఇస్తోందనీ, టీటీడీ ట్రస్టుబోర్డు సభ్యత్వంలోగానీ, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల విషయంలోగానీ కొంతమంది ఆంధ్రా నాయకుల్ని కాదనిమరీ తెలంగాణ నేతలకు పదవులు ఇచ్చారంటూ కొంతమంది ఏపీ నేతలు చెబుతున్నారు! ఇలాంటి టాపిక్స్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడకుండా ఉంటేనే అన్నిరకాలుగా బాగుంటుందని అంటున్నారట! మరి, రేవంత్‌రెడ్డి ఈ సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటారా..? తెలంగాణలో తెలుగుదేశం బలపడాలీ అనుకుంటే ఆంధ్రా ముద్ర నుంచి ఆ పార్టీ బయటకి రావాల్సి ఉంటుంది. అదే వ్యూహంతో పార్టీ అధినాయకత్వం ఉన్నా… రేవంత్ మాత్రం కేసీఆర్‌ను విమర్శిస్తున్న క్రమంలో ఆ టాపిక్‌ను మళ్లీమళ్లీ గుర్తు చేస్తున్నట్టు అవుతోంది.