కాపుల రిజర్వేషన్ల కోసం మరోసారి ముద్రగడ ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు సత్యాగ్రహ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముద్రగడను హౌస్ అరెస్ట్ చేశారు! దీంతో తూ.గో. జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ యాత్రకు అనుమతులు లేవని పోలీసులు అంటున్నారు. మీడియాతోపాటు ఇంటర్నెట్ ప్రసారాలపై కూడా ఆంక్షలు విధించారు. ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు యుద్ధ ప్రాతిపదిక పోలీసుల మోహరింపూ నిషేదాజ్ఞలూ ఇవన్నీ చూస్తుంటే కాపుల ఉద్యమం పట్ల ప్రభుత్వం గందరగోళానికి గురౌతోందా, లేదా ఉద్దేశపూర్వంగానే ఇలాంటి వైఖరి అవలంభిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీలూ తట్టుకోలేవు. తెలుగుదేశం కాస్త ఎక్కువగా తట్టుకోలేకపోతోంది. నిజానికి, ముద్రగడ పాదయాత్రపై ఎలాంటి ఓవరాక్షన్ చేయకుండా ఉంటే… ఆయన అనుకున్న నిరసన కార్యక్రమం ఇప్పటికే పూర్తై ఉండేది. ఇప్పుడు కిర్లంపూడి చుట్టూ గస్తీ కాస్తున్న పోలీసుల్నే ఉద్యమ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా పెట్టి ఉంటే సరిపోయేది. కానీ, ముద్రగడ ఉద్యమిస్తే శాంతిభద్రతలకు విఘాతం అనే స్థాయి ప్రచారం కల్పించి.. ఆయన్ని అడుగడునా అడ్డుకుంటూ పోతూ ఓరకంగా వారిలో అసహనం పెరుగుతూ పోవడానికి ప్రభుత్వమే కారణమౌతున్నట్టుగా ఉంది.
నిజానికి, నవంబర్ లోనే ఈ పాదయాత్ర జరిగి ఉండాల్సింది. అప్పుడూ ఇలానే అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు. ఇప్పుడు జనవరిలో కూడా అదే పంథాలో ముద్రగడను గృహనిర్బంధం చేశారు. రేప్పొద్దున్న ఫిబ్రవరిలో, లేదా మార్చిలో మళ్లీ పాదయాత్ర అనొచ్చు! అప్పుడూ ఇదే పంథా కొనసాగుతూ పోతుందా? ఇలా ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని ముందుకు సాగనీయకుండా ఆపడం వెనక తెలుగుదేశం సర్కారు ఉద్దేశం ఏమై ఉంటుందన్నది ప్రశ్న..? కాపుల రిజర్వేషన్లకు పరిష్కారం చూపించకుండా ఉండటం వెనక చంద్రబాబు వ్యూహం ఏంటో మరి..? ఈ అంశాన్ని కూడా వచ్చే ఎన్నికల వరకూ తీసుకెళ్లాలనా…? వారు కోరినట్టు రిజర్వేషన్లు ఇతర సామాజిక వర్గాల నుంచి మద్దతు తగ్గిపోతుందన్న భయమా..? అలాంటి లెక్కలున్నప్పుడు ఎన్నికల ముందు ఇలాంటి హామీలు ఎందుకివ్వాలి..?
ప్రజల నుంచి పెల్లుబికి వస్తున్న ఉద్యమాలకి వీలైనంత త్వరగా పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అంతేగానీ, ఇలా ఎప్పటికప్పుడు అడ్డుకట్టలు వేస్తూ పోతుంటే పరిస్థితులు వేరేలా పరిణమించే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట.