పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అప్పట్లో కేంద్రం ఒక కమిటీ వేసిన సంగతి గుర్తుందా..? అదేనండీ.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చేందుకు ఐదుగురు ముఖ్యమంత్రులతో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది కదా! దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని అధ్యక్షునిగా కూడా నియమించింది. ఇన్నాళ్లూ ఆ కమిటీ ఏమైందో తెలీదు! కానీ, ఇప్పుడు ఓ నివేదికను ప్రధానికి సమర్పించింది. కమిటీ తయారుచేసిన కొన్ని సిఫారులను ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రధానికి అందించారు.
రూ. 50 వేలు మించిన విత్ డ్రాలపై పన్నులు వేయాలని చంద్రబాబు కమిటీ ప్రధానంగా సూచించింది. నగదు రహితాన్ని ప్రోత్సహించడం కోసం డిజిటల్ లావాదేవీలపై ట్యాక్సులు లేకుండా చేయాలని చంద్రబాబు కోరారు. డిస్కౌంట్లూ, ఆఫర్లూ ప్రకటిస్తూ ఆదాయపన్ను పరిధిలో రానివారికి స్మార్ట్ఫోన్లు, బయోమెట్రిక్ మెషీన్ల కొనుగోళ్లపై రూ. 1000 తగ్గింపు ఇవ్వాలని అన్నారు. అన్ని లావాదేవీలూ ఆధార్ ఆధారంగానే జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం సాధించింది ఏంటో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికే అర్థం కాని పరిస్థితి! అన్ని రంగాలనూ కోలుకోలేని దెబ్బ తీసిన నిర్ణయమిది. ఎంత నల్లధనం బయటకి వచ్చిందో తెలీదుగానీ… కష్టార్జితాన్ని వాడుకోవడంపై ఇంకా కొత్తకొత్త ఆంక్షలు విధిస్తే సామాన్యుడి అసహనాన్ని మరింత పెంచినట్టే అవుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగిన ఇన్నాళ్ల తరువాత చంద్రబాబు కమిటీ సూచించిన సిపార్సులు ఇలా ఉన్నాయి. ఈ నివేదికలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే సూచనలుగానీ, దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే సలహాలు లాంటివిగానీ ఏవీ లేవు. కేవలం నగదు రహితం అనే పరిధిని దాటి కమిటీ ఆలోచించినట్టు లేదు. ఆ గీత దాటొద్దన్న పరిమితులు ఉన్నాయేమో మరి! దాటితే వాస్తవాలు బయటపడతాయి కదా!
ఇది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కమిటీ ఇచ్చిన నివేదిక. కాబట్టి.. దీనిపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నదీ చర్చనీయాంశమే. ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తన సలహా వల్లనే ప్రధాని ప్రకటించారని గతంలో చంద్రబాబు చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేస్తే… మళ్లీ అదే బాటలో చంద్రబాబు క్రెడిట్ క్లెయిమ్ చేసుకోకుండా ఉంటారా..? ఈ యాంగిల్ మోడీకి తెలియంది కాదు. కాబట్టి, చంద్రబాబు కమిటీ సిఫార్సులపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేదీ ఆసక్తికరంగానే ఉంది!