తెలుగు మీడియాకి ఏమైంది..? ప్రతీ విషయంపైనా తనదైన ముద్ర వేస్తూ పోటీపడే న్యూస్ ఛానల్స్ కి ఇప్పుడేమైంది..? ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మౌనాన్నే తమ బాషగా ప్రస్తుతం మీడియా ఎందుకు చేసుకుంది..? ప్రత్యేక హోదా మా హక్కు అంటూ నినదిస్తున్న యువతకు, ఏపీ వాసులకు తెలుగు మీడియా ఇస్తున్న సహకారం ఎంత..? యువత పోరాటానికి ప్రభుత్వం నుంచి మద్దతు లేదన్నది సుస్పష్టం అయినవేల… మీడియా నుంచి మద్దతు కరువవ్వాల్సిందేనా..? ఏపీ యువత నుంచి మీడియాకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే!!
హోదాకోసం పోరాడే విషయాలకంటే ఎక్కువగా.. ఈ హోదాకు రాని అనుమతుల గురించి, జల్లికట్టుతో ప్రత్యేక హోదాని కంపేర్ చేయడం గురించి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న స్టేట్ మెంట్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది మీడియా! అది మంచా చెడా అనే విషయం కాసేపు పక్కనపెడితే… తమిళుల జల్లికట్టు వ్యవహారంలో యువత పోరాటానికి మద్దతుగా నిలిచింది మీడియా. మెరీనా బీచ్ అలజడిని ఢిల్లీవరకూ వినిపించేలా చేసింది.. తంబీల ఆవేదనను, ఆగ్రహాన్ని హస్తినకి మోసుకెళ్లింది. ఈ విషయంలో చట్టబద్దత ఉన్న, చట్టసభల్లో ప్రకటించిన ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మీడియా స్టాండ్ ఇంతేనా? ప్రభుత్వ పెద్దల అంగీకారం, అనుమతి విశాఖలో తలపెట్టిన నిరసనకు లేదు కాబట్టి… ఇంత విలువైన అంశంపై మీడియా నుంచి లభిస్తున్న మద్దతింతేనా? ఇదే ఏపీ యువత ప్రశ్న!
అధికారంలో ఉన్న పెద్దలు పట్టించుకోరు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎప్పుడో ఆ విషయాన్ని సైడ్ చేసేశారు. దానికి కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్రెడిట్ గేం సంగతులు కాసేపు పక్కనపెడితే… ఏపీ ఎంపీల నిర్లక్ష్యమో, అధినేత అసమర్ధతో… కారణం ఏదైనా ఏపీకి ప్రత్యేక హోదా కాస్త “ప్రత్యేక ప్యాకేజీ” అని చప్పబడిపోయింది. నిన్న ప్రాణవాయువు అని చెప్పిన పెద్దలే… అది సంజీవని కాదని నేడు అనగలుగుతున్నారు. నాయకుల నాలుకకంటే నరం లేకపోవచ్చు, ఇచ్చిన మాటకు విలువలేకపోవచ్చు… కానీ ప్రజాప్రయోజనాల విషయంలో, ముఖ్యంగా రేపటి యువత పోరాటం విషయంలో మీడియా కూడా ఇలానే ప్రవర్తించాలా? స్వేఛ్చగా నిర్ణయాలు తీసుకునే ఫోర్త్ ఎస్టేట్ ఇలా ఏపీ యువతకు హ్యాండ్ ఇవ్వడం సబబేనా?
జల్లికట్టు స్పూర్తో, జగన్ సపోర్టో, పవన్ మద్దతో… కారణం ఏదైనా ఏపీ యువత తమ భవిష్యత్ కోసం ఏకమైంది.. పోరాటానికి సిద్ధమైంది. ఈ సమయంలో వారికి మీడియా నుంచి కూడా ఫుల్ సపోర్ట్ లభిస్తే.. ఫలితం కచ్చితంగా ఆశించినదానికంటే ఎక్కువగా వస్తుందనడంలో సందేహం లేదు. ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి, వారి వారి పోరాటాలకు మద్దతివ్వడానికి ముందుకు రావాల్సిన మీడియా ఇలా ఎందుకుండిపోయింది..? తెలుగు మీడియా.. నీకిది తగునా..!?