సరిగ్గా గమనిస్తే.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటల్లో కమ్యునిస్ట్ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయని! అది ఒకరకంగా కొన్ని విషయాల్లో గొప్పదే! అలాగే.. పవన్ చెప్పే మాటలు, చదివిన పుస్తకాలు దాదాపుగా విప్లవ సాహిత్యం మార్కులో రాసినవే! పవన్ నోట ప్రతీసారి వినిపించే కవులు, గేయాలు మొదలైనవన్నీ “ఎర్ర”మాటలే! ఈ క్రమంలో పవన్ పోరాటాలకు కాస్త అనుభవం ఉన్న పోరాటం కూడా కలిస్తే బాగుంటుందని అప్పట్లో రకరకాల కామెంట్స్ వినిపించేవి! అయితే తాజాగా పవన్ – కమ్యునిస్టులతో కలిసి పనిచేయబోతున్నారనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఎర్ర జెండాలకు – ఆ ఎర్ర తువాలుకు మధ్య సంబందం ఎంత వరకూ వచ్చిందో చెబుతున్నారు రామకృష్ణ.
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై గళం విప్పిన జనసేన అధినేత పవన్.. రానున్నరోజుల్లో తన ఆందోళనల్ని మరింత ఉధృతం చేయనున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… పవన్ ఒక్కడే కాబట్టి, ఆయనకున్న గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల సంఖ్య కూడా ప్రస్తుతానికి పరిమితంగా ఉంది కాబట్టి… రాబోయే కాలంలో చేయబోయే ఆందోళనలు కూడా పాల పొంగని, తాటాకు మంటలే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే తాజాగా ఈ వన్ మ్యాన్ ఆర్మీకి తోడు తొరికిందట. ఈ విషయాలపై స్పందిస్తున్నారు కామ్రెడ్లు. ప్రభుత్వ విధానాలపై తనదైన విమర్శలు సంధిస్తున్న పవన్ కు తోడుగా నిలిచేందుకు.. ఆయనతో కలిసి నడిచేందుకు ఏపీ కమ్యూనిస్టు నేతలు సమాయుత్తమవుతున్నారట.
తాజాగా, ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ… రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోకలిసి నడవనున్నట్లుగా తెలిపారు. ఈ స్నేహానికి సంబందించి ఇప్పటికే పవన్ తో చర్చలు జరిపినట్లుగా తెలిపిన రామకృష్ణ మాటల్లో.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురవడానికి పవన్ బాట పట్టేందుకు, పవన్ తో కలిసి నడిచేందుకు ఫిక్సయినట్లుగా తెలుస్తుంది! ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీసే ధైర్యం చంద్రబాబుకు లేని క్రమంలో కచ్చితంగా పవన్ తో పోరాటం ప్రయోజనం కలిగిస్తుందని ఎర్రన్నలు భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ విషయంలో అన్నీ అనుకూలంగా జరిగితే… ఎర్ర జెండాలు – ఎర్ర తువాలుతో కలిసినట్లే!!
ఇదే జరిగితే… ‘పూర్తిస్థాయి ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లడం లేదు’అనే విమర్శను ఎదుర్కొంటున్న “జనసేన పోరాటాలు” ఇక ఆ విమర్శను ఎదుర్కోకపోవచ్చనే అనుకోవాలి. ఇదే క్రమంలో పవన్, టీడీపీ విషయంలో సన్నాయి నొక్కులు నొక్కడం మానేసి వీలైనంత ఉధృతంగా పోరాడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కమ్యునిస్టులతో జనసేన కలయిక అనేది పవన్ రాజకీయ జీవితంలో కచ్చితంగా విలువైన మలుపనే అంటున్నారు విశ్లేషకులు!