ఏమాటకామాట చెప్పుకోవాలంటే “ప్రత్యేక హోదా” అనే విషయంలో టీడీపీ, బీజేపీ నేతలు కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారనే చెప్పాలి. ఒకపక్క హోదా పేరు చెప్పి ఈ రెండు పార్టీల నేతలకు, ఇతర రాజకీయ పార్టీలనుంచి రెండువైపులా వాయింపులు పడిపోతున్నాయి. మరోపక్క ఏపీలో దాదాపుగా గరిష్ట శాతం ప్రజానికానికి హోదా గొప్పతనం తెలిసిపోయింది! ప్యాకేజీ అనేది హోదా ముందు ఏమీ కాదని, హోదా వల్ల భవిష్యత్తులో ఎన్ని ప్రయోజనాలుంటాయో ప్రతీ ఒక్కరికీ అర్ధమైపోయింది! ఈ క్రమంలో ఏపీ టీడీపీ నేతల ఇబ్బందులు మామూలుగా లేవు! దీంతో వారు చేస్తున్న పనులు, ఇస్తున్న స్టేట్ మెంట్స్ లో కొందరివి కోపం రప్పించి ఒళ్లు మండేలా చేస్తుంటే.. మరికొందరి మాటలు చక్కిలిగింతలు పెట్టి మరీ నవ్వు తెప్పిస్తున్నాయి!
హామీలిచ్చిన నాయకులు, ఆ హామీని నెరవేర్చుకోవాల్సిన నాయకులు చేతులెత్తేసిన వేల.. జల్లికట్టును స్పూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదాపై పోరాడాలని ఏపీ యువత నిర్ణయించుకుంటే అనుమతి ఇవ్వలేదు, ముందస్తు అరెస్టులు చేయించారు. దీనికి తోడు గౌరవనీయులైన సుజనా చౌదరి అయితే “పందుల ఆటలు ఆడుకోండి” అని విజ్ఞత మరిచి మాట్లాడారు! హోదా తెచ్చే దమ్ములేని ఇలాంటి పెద్దలు జనాలపై మాత్రం నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. ఈ మాటలకు ఆంధ్రులందరికీ ఒళ్లు మండిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా టీజీ వెంకటేష్ ప్రత్యేక హోదాపై మాట్లాడారు.. తమదైన హాస్యవల్లరి వినిపించారు.
టీజీ వెంకటేష్ తాజాగా స్పందిస్తూ… ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్యాకేజీ మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చారు. సాధ్యం కాదనే మాటల్లో వారి చేతకాని తనం కనబడుతుందనే విషయం మరిచిన ప్రభుత్వ పెద్దలు, అదేదో గొప్ప విషయంలా తెగ చెప్పుకుంటున్నారు!! ఆ సంగతలా ఉంటే… ఏపీ ప్యాకేజీని తప్పక సాధిస్తామని, ఒకవేళ సరిపడా ప్యాకేజీ అందకపోతే కేంద్రంపై యుద్ధం తప్పదని చెబుతున్నారు. వినేవాడు ఆంధ్రుడైతే టీజీ వారి హాస్యం ఈ రేంజ్ లో ఉంటుంది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది! కేంద్రంలో బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు మద్దతిస్తున్న.. చట్టబద్దమైన ప్రత్యేక హోదాని కేంద్రంతో పోరాడి సాధించుకునే విషయంలో చేతులెత్తేసిన ఈ పెద్దమనుషులు.. ఏకంగా కేంద్రంతో యుద్దమే చేస్తారంటే హాస్యం కాక మరేమిటి!
ఏదో బలమైన మాటలు, బరువైన పదప్రయోగాలు చేయాలనే తప్ప.. ప్రాక్టికల్ గా కేంద్రంపై యుద్ధం చేసేటంత సీన్ ఏపీ టీడీపీ నేతలకు ఉందంటారా? అదే ఉంటే ప్రస్తుతం ఏపీకి ఈ పరిస్థితి వచ్చేదా? ఎవరి ఓట్లతో అయితే గద్దెనెక్కారో వారికే ఎగనామం పెడుతున్నప్పుడు, ఇలాంటి “మాటల నేతలు”న్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకొస్తుంది..? హాస్యం కాకపోతేనూ..!!