పోలవరం ప్రాజెక్టు… టీడీపీ నేతలు చెబుతున్నట్లు చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి! 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరతామని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. ఆ పరిస్థితులు ఎట్టివో, ఏవో వారికే తెలియాలి! వాస్తవంగా మాట్లాడుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ఎంతో కొంత పూర్తి కావాలి. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం మైలేజ్‌ను పెంచే ప్రధాన ప్రచారాస్త్రం ఇదే కదా! పోలవరం జాతీయ ప్రాజెక్టు.. అంటే, దాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. కానీ, ఆ పనులన్నీ చంద్రబాబు తన భుజాన వేసుకున్నారు. వారానికోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. విర్చువల్ ఇన్ స్పెక్షన్ చేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది! కానీ, ప్రస్తుతం ప్రత్యేక హోదా కాదనుకోవడం… ప్యాకేజీకి చట్టబద్ధత సాధించడం అనేది ప్రధానంగా జరుగుతున్న నేపథ్యంలో… పోలవరానికి సంబంధించిన ఒక లాజిక్‌ను తెలుగుదేశం మిస్ అవుతోందని చెప్పాలి!
తెలంగాణ ఏర్పాటు చేస్తున్నప్పుడు విభజన చట్టాన్ని నాటి కేంద్రప్రభుత్వం ఆమోదించింది. అప్పుడే పోలవరం పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని చట్టంలో చెప్పారు. అంటే, పోలవరానికి జాతీయ హోదా! ఇదే సమయంలో ప్రత్యేక హోదా గురించి నాడు ప్రతిపక్షంలో ఉన్న భాజపా, తెలుగుదేశం పార్టీలు బలంగా వాదించాయి. ఐదూ పదీ చాలదూ ఏకంగా 15 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం అని బల్లలు గుద్దేశాయి. తమకు ఓటు వేస్తే, అధికారంలోకి రాగానే హోదా ఇచ్చేస్తాం అంటూ భాజపా, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చేశాయి. ఆ తరువాతే అసలు గేమ్ స్టార్ట్ అయింది. హోదాని నెమ్మదిగా అటకెక్కించారు. ఎందుకయ్యా.. అంటే, విభజన చట్టంలో హోదా లేదు కదా, నాటి కాంగ్రెస్ సర్కారు చట్టంలో హోదా పెట్టలేదు కదా అంటూ భాజపా నేతలు లాజిక్స్ మాట్లాడారు. భాజపా వాదన కాసేపు పక్కన పెడదాం! ఇప్పుడు తెలుగుదేశం అనుసరిస్తున్న తీరు గురించి మాట్లాడుకుందాం.
ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు సర్కారు ఒప్పుకోవడంలో ప్రధాన కారణం.. పోలవరం నిర్మాణం అంటున్నారు! పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కోసమే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకుంటున్నాం అని ఆయనే స్వయంగా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ… మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే… పోలవరానికీ, ప్యాకేజీకి సంబంధం ఏంటీ? ప్యాకేజీ ఒప్పుకుంటే తప్ప పోలవరం పూర్తి చేయ్యరా..? పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలన్నది చట్టంలో క్లిస్టల్ క్లియర్ గా ఉంది కదా! అలాంటప్పుడు పోలవరం అనేది ఆంధ్రా హక్కు అవుతుంది. ఆ హక్కును సాధించుకోవాల్సింది ఎవరు..? ఆ హక్కును సాధించుకోవడంలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది..? దానికీ దీనికీ సంబంధం ఎలా..?
చట్టప్రకారం రావాల్సిన పోలవరం నిధులపై ఎప్పటికప్పుడు కేంద్రాన్ని చంద్రబాబు అర్థించాల్సిన అవసరం ఏమొచ్చింది..? పోలవరం పూర్తి చేయడం కోసమే ప్యాకేజీని అంగీకరించాం అంటూ ఏపీ సర్కారు ప్రజలను ఎందుకు మభ్యపెడుతోంది..? చట్టప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానికి ఉన్నప్పుడు… నాబార్డు ఓ 2 వేల కోట్లు అప్పుగా ఇస్తే చంద్రబాబు సర్కారు సంబరాలు చేసుకోవడమేంటీ..? ఇప్పుడు ప్యాకేజీలో భాగంగానే పోలవరం పూర్తవుతోందని చంద్రబాబు చెప్పడమేంటీ..? ఒకవేళ ప్యాకేజీకి చట్టబద్ధత రాకపోతే.. ప్యాకేజీలో భాగమైన పోలవరం పరిస్థితి ఏమౌతున్నట్టు..? అయినా.. పోలవరం ప్రాజెక్టు కోసమే ప్యాకేజీ అని టీడీపీ ప్రచారం చేసుకోవడమంటే, ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నట్టే…! ఇది ముమ్మాటికీ అర్థంలేని వాదన!!