ఆంధ్రాలో ఈ మధ్యనే భాగస్వామ్య సదస్సును భారీ ఎత్తున్న ఏపీ సర్కారు నిర్వహించింది. రూ. 8 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే చాలని అనుకుంటే, అనూహ్యంగా పదిన్న లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు సర్కారు గొప్పగా చెప్పుకుంటోంది. దేశ విదేశాల నుంచీ పలు కంపెనీలు పోటీ పడుతూ ఏపీ సర్కారుతో ఎమ్.ఒ.యు.లు కుదుర్చుకుని సంతకాలు పెట్టించుకున్నాయి. అయితే, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం బూటకమనీ, ఇదంతా అసత్య ప్రచారం అనే విమర్శలు మొదలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై డీమానటైజేషన్ ఎఫెక్ట్ ఉన్నా… ఐటీ రంగంపై ట్రంప్ రూపంలో టెన్షన్ పొంచి ఉన్నా కూడా ఏపీకి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎలా వచ్చాయన్నది చంద్రబాబు మాత్రమే తెలిసిన రహస్యం!
సరే, టీడీపీ నేతలు చెబుతున్నట్టుగానే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు పరుగులు తీసుకుంటే వచ్చేశారనుకుందాం! పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఆంధ్రాలో ఉన్నాయని, అంతర్జాతీయ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రబాబు విజయం సాధించారు అనుకుందాం. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే. అయితే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కూడా భారీ పారిశ్రామిక వేత్తలే ఉన్నారుగా! రాయపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్, గల్లా జయదేవ్.. వీళ్లంతా బడా పారిశ్రామిక వేత్తలే కదా! విశాఖలో ఎన్నో ఎమ్.ఒ.యు.లు జరిగాయని చెబుతున్నారే… మరి, ఈ పారిశ్రామిక వేత్తలు ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎందుకు ముందుకు రాలేదు. దేశ విదేశాల కంపెనీల ప్రతినిధులను ఒప్పించగలిగే వాక్చాతుర్యం కలిగిన చంద్రబాబు నాయుడు… సొంత పార్టీలో ఉన్న ఎంపీలతో సొంత రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టించలేకపోయారా..?
జాగ్రత్తగా గమనిస్తే… రాయపాటిగానీ, సుజనా చౌదరిగానీ, సీఎం రమేష్గానీ, టీడీపీలో ఉంటున్న ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలో అత్యధిక శాతం నాయకులు ఇతర రాష్ట్రాల్లోనే పెట్టుబడులు పెట్టారు, పరిశ్రమలు కట్టారు! ఆ రాష్ట్రాలు కూడా గతంలో ప్రత్యేక హోదా పొందినవే ఉండటం గమనార్హం! అంటే, ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపనకు ఏ రేంజిలో రాయితీలు వస్తాయో స్పష్టమౌతోంది కదా! ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులు పెట్టేంత స్థోమత ఇప్పుడు వారికి ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఇంతకుముందు, వారు ఏయే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారో… ఆ రాష్ట్రాలనే తమ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రాలుగా ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే… ప్రత్యేక హోదా ప్రాధాన్యత అర్థమౌతుంది.