అద్భుతం జరిగిపోయింది. చిరంజీవి, పవన్ కల్యాణ్ కలసి నటించబోతున్నారన్న గాలి వార్తని కాస్తా పక్కా చేసి ఓ మ్యాజిక్ చేసేశారు టి.సుబ్బరామిరెడ్డి. నిజానికి ఈ కాంబోలో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. `తమ్ముడితో కలసి నటిస్తా` అని చిరు. అన్నయ్యతో సినిమా చేయడం కంటే ఆనందం ఏముంది` అని తమ్ముడూ.. ఇద్దరూ చెప్పేవారే గానీ ఈ కాంబో విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.. పడలేదు. పైగా ఈమధ్య వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. అన్నయ్య ఆడియో ఫంక్షన్‌కి తమ్ముడు వెళ్లలేదు. తమ్ముడి గురించి మాట్లాడడానికి అన్నయ్యకు ఇష్టం లేదు. దాంతో ఈ కుటుంబం మధ్య ఏదో జరుగుతోందన్న గాసిప్పులు మరింత పెరిగాయి. మొన్న ఖైదీ నెం.150 అభినందన సభలో మెగా మల్టీస్టారర్ తీస్తా… చిరు, పవన్, చరణ్, బన్నీలను ఒకే సినిమాలో చూపిస్తా – అంటూ సుబ్బరామిరెడ్డి అంటుంటే ఏదో నామ్ కే వాస్తే అనుకొన్నారంతా. ఆ వార్త తిరుగుతూనే ఉండగా.. దాన్ని పక్కా చేసేశారాయన. అదీ.. సుబ్బరామిరెడ్డి స్టామినా.
ఇప్పటికిప్పుడు రూ.1000 కోట్లు పెట్టి సినిమా తీయమన్నా తీసేయగల సామర్థ్యం ఉన్న నిర్మాత సుబ్బరామిరెడ్డి. ఆయనలాంటి నిర్మాత తలచుకొంటే… ఎన్ని అసాధ్యాలనైనా సుసాధ్యం చేయగలరు. పైగా చిరుకి ఆత్మీయ బంధువు. అందుకే ఈ కాంబినేషన్‌ని అక్కడి నుంచి నరుక్కొచ్చారు సుబ్బరామిరెడ్డి. ‘తమ్ముడు ఒప్పుకొంటే నేను ఓకే’ అంటూ చిరు దగ్గర మాట తీసుకొన్నారు. పవన్‌ని ఒప్పించడం కష్టం అనుకొంటే… అందుకోసం త్రివిక్రమ్‌ని రంగంలోకి దించారు. త్రివిక్రమ్ – పవన్‌ల మధ్య స్నేహం తెలియంది కాదు. అందుకే త్రివిక్రమ్‌ని కూర్చోబెట్టి మెల్లిగా మాటలతో లైన్లోకి తీసుకొచ్చారు సుబ్బిరామిరెడ్డి. నిజానికి చిరుకి త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఆమధ్య చిరుని త్రివిక్రమ్ మర్యాదపూర్వకంగా కలసినప్పుడు తన మనసులోని మాట చిరు త్రివిక్రమ్‌తో పంచుకొన్నారు కూడా. ఆ సినిమాకి పవన్ నిర్మాతగా వ్యవహరిస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు చిరుతో ‘ఓకే’ అనిపించుకొంది కూడా త్రివిక్రమ్ ని చూపించే. త్రివిక్రమ్ చెప్పిన మాటలకే… పవన్ కూడా కాస్త లొంగాడని, ఎందుకైనా మంచిదని, వాళ్ల అంగీకారం తీసుకొన్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీడియాకు ఈ కబురు లీక్ చేసేశాడాయన. దాంతో అటు చిరు, పవన్, ఇటు త్రివిక్రమ్‌లకు ఒకేసారి లాక్ చేసేసినట్టైంది. చిరు,పవన్‌లకు ఎంత కావాలంటే అంత పారితోషికం సింగిల్ పేమెంట్‌తో ఇచ్చే కెపాసిటీ ఉంది సుబ్బిరామిరెడ్డికి. త్రివిక్రమ్‌కి ఓ బడ్జెట్ కేటాయించేసి ‘నీ ఇష్టం వచ్చిన సినిమా తీయ్’ అంటూ ఫ్రీ హ్యాండ్ కూడా వదిలేయగలడు. సుబ్బిరామిరెడ్డి తెలివితేటలు, ఆర్థిక బలం ఈ కాంబినేషన్‌కి మూలమైతే.. త్రివిక్రమ్ చొరవ అందుకు మార్గం సుగమం చేశాయి. అదీ.. ఈ కాంబో వెనుక ఉన్న లోగొట్టు.