కేంద్రం గురించి ఏం చెప్పాలన్నా ఆయన తరువాతే. ఒక నిర్ణయం తీసుకున్నాక… దాని ద్వారా కేంద్రం ఏం చేయాలనుకుంటోంది, ఎలాంటి ప్రయోజనాలకు ప్రజలకు ఇవ్వాలని భావిస్తోందనేది కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెబితేనే రక్తి కడుతుంది! ప్రత్యేక హోదా విషయమే తీసుకోండి. నీతి ఆయోగ్ ఆలోచిస్తోందని చెప్పారు, ప్రధాని దగ్గరకు విషయం వచ్చేసిందన్నారు. పక్క రాష్ట్రాలు అభ్యంతరాలు అన్నారు… ఆ తరువాత, హోదా వల్ల ప్రయోజనాలు లేవని చెప్పారు! ఎంత అందంగా చెప్పారో కదా! ప్యాకేజీ గొప్పతనం గురించి ఆంధ్రాలో పర్యటించి వివరిస్తూ, సన్మానాలు పొందారు. ఇప్పుడు, కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా ఆంధ్రులకు కొన్ని అనుమానాలు ఉండిపోయాయి! వాటిని వివృత్తి చేయాలంటే వెంకయ్య నాయుడు మరోసారి ఆంధ్రాలో పర్యటించాలేమో!
బడ్జెట్ ద్వారా ఆంధ్రాకి ఒరిగింది ఏంటీ అనేది ఆంధ్రులకు అస్సలు అర్థం కావడం లేదు. కేంద్రం ఏదో చేసేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఊదరగొట్టేస్తున్నారు! ఆంధ్రాకి అంత ప్రయోజనం, ఇంత ప్రయోజనం అనేస్తున్నారు. అవేంటో కూలంకషంగా వివరించాలంటే ఆయన రావాల్సిందే అనేది కొంతమంది అభిప్రాయం. పోలవరం ప్రాజెక్టుకు అదనపు కేటాయింపులు ఎన్నున్నాయో తెలీడం లేదు. ప్యాకేజీ ద్వారా ఏమేం ఇవ్వబోతున్నారో తెలీడం లేదు. దానికి చట్టబద్ధత ఎందుకు ఆలస్యం అవుతోందో తెలీడం లేదు. గతంలో గొప్పగా ప్రారంభించేసిన విద్యా సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావడం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు దశలవారీగా నిధుల కేటాయింపు ఎలా జరిగిందో కనిపించడం లేదు. రాజధాని ప్రాంత రైతులకు ఇస్తున్న పన్ను రాయితీ ప్రయోజనాలపై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వ్యవసాయ భూమిని అసెట్ గా చూడటం అనేది ఆదాయపన్ను చట్టంలోనే లేదని కొంతమంది అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ఏం సాధించిందో తెలీడం లేదు. నల్లధనం ఎంతొచ్చిందో చెప్పడం లేదు.
సో.. ఇన్ని అనుమానాలు ఉన్నాయి! వాటిని నివృత్తి చేయాలంటే అది వెంకయ్య నాయుడు వల్లనే సాధ్యం అనేది చాలామంది అభిప్రాయం. కానీ, ఆయన మాత్రం బడ్జెట్ సమావేశాల తరువాత ఏమయ్యారో తెలీడం లేదు. నిజానికి, వెంకయ్యకు మాంచి కమాండ్ ఉన్న టాపిక్స్ ఇవన్నీ. గతంలో ఆయన వీటిపై చాలా మాట్లాడి ఉన్నారు. కాబట్టి, ఈ అంశాలపై కేంద్రం మతలబు ఏంటో.. మనసులో మాట ఏంటో ఆయనే విడమరచి చెప్పగలరు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఆంధ్రాలో పర్యటించాల్సిన చారిత్రక అత్యవసరం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆయన పర్యటించాలేగానీ మరోసారి సన్మానాలు చేసేందుకు కూడా వెనకాడనివారు ఉన్నారు కదా!