గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదేనో కాదో తెలియదు కానీ.. సంప్రదింపులతో సద్దుమణిగే సమస్యను సామాజిక ఉద్యమ స్థాయికి తీసుకెళ్తూ ఉండటం అంటే మాత్రం ఇదే! ఈ మధ్య ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రకు ప్రయత్నించడం.. యథావిధిగా పోలీసులు ఆయన్ని గృహ నిర్బంధం చేయడం జరిగిపోయాయి. ఈ ఇష్యూ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే జనసేన అధినేత ద్వారా విశాఖ తీరంలో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమాన్ని తెరమీదికి తెచ్చారన్న విమర్శలు కూడా వినిపించాయి. కాపుల ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకు టీడీపీ సర్కారు అనుసరించిన వ్యూహాలు ఎంతవరకూ ఫలిస్తున్నాయన్నది ఇప్పుడు ప్రధానాంశం.
నిజానికి, కాపుల రిజర్వేషన్ల పట్ల తెలుగుదేశం అనుసరిస్తున్న వైఖరి… ఉద్యమాన్ని పరోక్షంగా మరింత బలోపేతం చేస్తోందనే చెప్పాలి. తాజా గృహ నిర్బంధం తరువాత కాపుల ఉద్యమ నేత ముద్రగడ జిల్లాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇకపై, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, నాయకుల్ని ఏకం చేయబోతున్నారట. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమం ఏక కేంద్రంగా కాకుండా… రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా నడిపించాలన్న వ్యూహంతోనే ఆయన ఈ పర్యటనలు సాగిస్తున్నట్టు చెప్పుకోవాలి.
గత ఏడాది నవంబర్లో కూడా ముద్రగడను ఇలానే గృహ నిర్బంధం చేసిన సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ తరువాత, ఆయనేం చేశారూ అనేది కూడా చెప్పుకోవాలి! అంతవరకూ కేవలం ముద్రగడ కేంద్రంగానే కాపుల ఉద్యమం సాగుతోందన్న వాదన వినిపించేది. కానీ, ఆ తరువాత ప్రముఖ కాపు నేతల్ని ఆయన కలుపుకుంటూ వెళ్లారు. దాసరి నారాయణరావు, చిరంజీవి, పలువురు మాజీ కేంద్రమంత్రులు.. ఇలా చాలామందితో సమావేశాలయ్యారు. ఉద్యమానికి కావాల్సిన నైతిక మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.
తాజా నిర్బంధం తరువాత జిల్లాలపై ముద్రగడ దృష్టి పెట్టారు. సో… ఇకపై కాపుల ఉద్యమిస్తే అది కిర్లంపూడికి మాత్రమే పరిమితయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముద్రగడను ఒకచోట నిర్బంధిస్తే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు ఉద్యమంలో ఏవైతే లోపాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారో… వాటన్నింటినీ సరిచేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని చంద్రబాబు సర్కారే కల్పిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి, పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది!!