ఒకే సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లకు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి పురస్కారాలు దక్కడం నంది అవార్డు చరిత్రలోనే అరుదైన సంగతి. ఆ ఫీట్‌ని సాధించారు నాని, సమంత. ఇద్దరూ కలసి నటించిన చిత్రం ఎటో వెళ్లిపోయింది మనసు. ఈచిత్రానికి గానూ 2013 నంది అవార్డుల జాబితాలో ఉత్తమ నటుడిగా నాని, నటిగా సమంతకు అవార్డులు దక్కాయి. అదే యేడాది వచ్చిన `మిథునం`లో ఎస్.పిబాలు, లక్ష్మి ఓ జంటగా నటించారు. వీరిద్దరికీ ప్రత్యేక పురస్కారాలు దక్కాయి. నిజానికి ఉత్తమ నటుడు, నటి.. ఈ రెండు పురస్కారాలు బాలు, లక్ష్మిలకే వస్తాయనుకొన్నారంతా. కానీ… వాళ్లకి స్పెషల్ జ్యూరీ ఇచ్చి సరిపెట్టింది అవార్డు కమిటీ.
అయితే నాని, సమంతలకు అవార్డు ఇవ్వడాన్ని అవార్డు కమిటీ అధ్యక్షురాలు జయసుధ సమర్థించారు. ఎటో వెళ్లిపోయింది సినిమాలో వాళ్లవి చాలా క్లిష్టమైన పాత్రలని, చిన్న వయసులోనే వాటిని సమర్థంగా పోషించాని, కెరీర్లో అడుగులు వేస్తున్న తొలి రోజుల్లో అవార్డులు ఇస్తే.. వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటాయని జయసుధ క్లారిటీ ఇచ్చారు. అయితే.. గ్లామర్నీ, యూత్నే దృష్టిలో ఉంచుకొని అవార్డులు ఎంపిక చేశారేమో… అనే విమర్శ వినిపిస్తోంది. సమంత, నానిలతో పోలిస్తే.. మిథునంలో తమ పాత్రల్ని అద్భుతంగా రక్తి కట్టించారు బాలు, లక్ష్మి. అవార్డులు ఇవ్వడానికి వయసుని కూడా ప్రాతిపదికగా తీసుకొంటారా?? అనే కొత్త అనుమానాలు నెలకొన్నాయిప్పుడు. యంగ్ హీరోలు, హీరోయిన్లకు అవార్డులు ఇస్తే.. అలాంటి వేడుకలపై జనాలు ఫోకస్ పెడతారని, అందుకోసమే నాని, సమంతలను ఎంచుకొన్నారన్న ఓ విమర్శ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో జ్యూరీకే తెలియాలి.