చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రభుత్వాధికారులకు ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ఉంటుందనే ఓ అభిప్రాయం ప్రచారంలో ఉంది! ఏ అర్ధరాత్రి వేళ ఏ నివేదికలు అడుగుతారో… ఏ తెల్లారుజామున రివ్యూ మీటింగ్ అంటూ ఫోన్ చేసేస్తారో అనే ఒత్తిడి ఈ మధ్య ప్రభుత్వాధికారుల్లో ఎక్కువౌతోందని కథనాలు వింటున్నవే. ప్రభుత్వాధికారులతో ఎలా పని చేయించుకోవాలో తనకు మాత్రమే తెలిసిన విద్యగా చంద్రబాబు భావిస్తుంటారేమో! అందుకే, ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏ పనులు ఎలా చెయ్యాలో క్లాసులు తీసేసుకుంటారు. ఇదే ధోరణిలో తాజాగా మంత్రులను కూడా హెచ్చరించారట!
ప్రభుత్వాధికారులతో ఎలా పనిచేయించుకోవాలో, ఎలాంటి పనులు చేయించాలో, ఎలాంటివి చేయించకూడదనేది కూడా చెప్పారట!
పార్టీలకూ రాజకీయాలకూ అతీతంగా ప్రభుత్వాధికారులు పనులు చేయాల్సి ఉంటుంది! కానీ, చంద్రబాబు తాజాగా ఉపదేశించింది ఏంటంటే… ప్రతిపక్షాలకు చెందినవారి పనులు అధికారులు చెయ్యకూడదని! అవునూ… ఇదే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన కిమిడి మృణాళినీ, మంత్రి పల్లె రఘునాధ రెడ్డిలకు ఇదే విషయమై క్లాస్ తీసుకున్నారట. ఈ ఇద్దరి మంత్రుల జిల్లాల్లో ప్రతిపక్ష నాయకులు చెబుతున్న పనులను అధికారులు ఇంకా చేస్తున్నారనీ, ఇదే విషయం తన దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి పరిస్థితులు ఉండొద్దని చాలాసార్లు చెప్పినా ఎందుకు లైట్‌గా తీసుకుంటున్నారని ఆగ్రహించినట్టు సమాచారం.
మంత్రులు చెప్పినట్టుగానే అధికారులు పనిచేయాలనీ, ఒకవేళ అలా నడుచుకోని ఆఫీసర్లు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డట్టు సమాచారం! మాట వినని అధికారులను బదిలీ చేయాల్సి వస్తుందన్నట్టుగా ఆయన చెప్పడం కొస మెరుపు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యేలు కారా.? రాజ్యాంగబద్ధంగా ప్రజలు వారినీ ఎన్నుకున్నారు కదా..? ప్రజల సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ల కూడదా..? అధికారులు ఉన్నది అధికారంలో ఉన్నవారి పనులు చేసి పెట్టేందుకా.. లేదా, ప్రజలకు సేవలందించేందుకా..? అంటే, ప్రతిపక్షం పట్ల ఎంత పక్షపాత బుద్ధితో అధికార పార్టీ వ్యవహరిస్తోందని మరోసారి అర్థమౌతోంది. ఇప్పటికే.. వైకాపా ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కోటా ప్రకారం రావాల్సిన నిధుల విషయంలో కూడా అధికార పార్టీ మోకాలడ్డుతోందని వైకాపా ఎమ్మెల్యేలు వాపోయిన సందర్భాలు కోకొల్లలు! అది చాలదన్నట్టు.. ఇప్పుడు అధికారులకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తే ఏమనుకోవాలి..?