ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఈనెల 6న లోకేష్ నామినేషన్ వెయ్యడానికి రంగం సిద్ధమైంది. దీంతో క్యాబినెట్ లోకి లోకేష్ ఎంట్రీ కూడా సెంట్ పర్సెంట్ ఖరారైనట్లే ! కాకపోతే.. లోకేష్ కి ఇవ్వబోయే బెర్త్ మీద మాత్రం టీడీపీలో సస్పెన్స్ మెయింటైన్ అవుతోంది. ఇప్పటికే చాలామంది సీనియర్ మంత్రులున్న బాబు క్యాబినెట్లో లోకేష్ కి ఏ పోర్ట్ ఫోలియో దక్కుతుందన్న దానిపై పార్టీలో ఒక లోతైన చర్చ.
సాధారణ పరిపాలన, లా అండ్ జస్టిస్, ఇంధన- మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు-వాణిజ్యం, సినిమాటోగ్రఫీ, టూరిజం సహా మరికొన్ని పోర్ట్ ఫోలియోలు చంద్రబాబు ఖాతాలోనే ఉండిపోయాయి.
వీటిలో ఏదో ఒకటి తీసి లోకేష్ జేబులో వెయ్యవచ్చన్నది ఒక అంచనా. అయితే.. ఐటీ శాఖ గానీ, పరిశ్రమలు గానీ.. లేక రెండూ గానీ లోకేష్ కి అప్పజెపుతారని పార్టీలో కొందరు సీనియర్లు చెప్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఉగాదిలోగా క్యాబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కూడా పూర్తయ్యేలా కసరత్తు జరుగుతోంది. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీయార్ కూడా ఐటీ-భారీ పరిశ్రమలు- మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్నారు. కాకపోతే కేటీఆర్ కి మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం వుంది.