తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి… ప్రతీరోజూ ఏదో ఒక కామెంట్‌తో హెడ్‌లైన్స్‌లో ఉండేవారు. రేవంత్ మాట్లాడారూ.. అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు మాత్రమే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. ఒకసారి జైలుకి వెళ్లి బయటకి వచ్చాక.. రేవంత్ ఏకైక టార్గెట్ తెలంగాణ సీఎం..! తన వెనక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారన్న ఒకే ధైర్యంతో కేసీఆర్‌పై పోరాటం సాగించేవారనే చెప్పాలి. అయితే, ఈ కేసు విషయమై ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా ఏం డీల్ కుదిరిందో తెలీదుగానీ… వాతావరణం అంతా సైలెంట్ అయిపోయింది. ఇద్దరు చంద్రులూ ఒకటయ్యారు. రేవంత్ సైలెంట్ అయ్యారు! కానీ, తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తేంటే… రేవంత్‌ని మరోసారి రంగంలోకి తీసుకొచ్చేట్టుగానే ఉన్నారని చెప్పుకోవాలి!
రేవంత్ రెడ్డిపై మైహోమ్స్ గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు కేసు దాఖలు చేయడం గమనార్హం. రూ. 90 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై కోర్టు స్పందించడం, రామేశ్వరరావు స్టేట్మెంట్స్ను రికార్డు చేయడం, వివరణ ఇవ్వాల్సిందిగా రేవంత్‌కు నోటీసులు జారీ చేయడం కూడా జరిగిపోయింది. రేవంత్‌పై తాజా కేసు వేయడం వెనక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉండే ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి, తెలుగుదేశం – తెరాసల మధ్య డీల్ కుదిరిందనీ, ఆ డీల్ ప్రకారమే తెలంగాణలో వలసలు ఆగిపోయాయి అంటూ ఈ మధ్య ఓ ప్రముఖ దిన పత్రిక కథనం ప్రచురించింది. చిత్రం ఏంటంటే… ఇలాంటి డీల్ ఏదీ లేదనిగానీ, ఇది కల్పిత కథనమనిగానీ తెరాస నుంచి ఎవ్వరూ స్పందించలేదు, ఖండించలేదు!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడం కోసమే చంద్రబాబు ఈ సంధి కుదుర్చుకున్నారనీ, అందుకే వలసలు ఆగాయనీ ఆ కథనం సారాంశం. సరే, ఆ డీల్ ప్రకారమే ఇద్దరి చంద్రుల మధ్య సయోధ్య కుదిరిందీ అనుకుంటే… ‘రేవంత్ మినహా’ అనే కండిషన్ ఏదైనా తెరాస పెట్టిందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగతంగా కూడా రేవంత్ చాలా విమర్శలు చేశారు. పార్టీల మధ్య రాజీ కుదిరినంత మాత్రాన… రేవంత్ విషయంలో తాము సైలెంట్‌గా ఉండలేమన్న అభిప్రాయం తెరాస నుంచి వ్యక్తమై ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సో… అలాంటి వ్యూహంలో భాగంగానే తాజాగా రేవంత్‌పై ఈ కేసు అనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. పైగా, కేసు పెట్టినవారు కూడా కేసీఆర్‌కు సన్నిహితులే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది! ఏదైతేనేం, రేవంత్‌ను మరోసారి మైకు ముందుకు ఆహ్వానించినట్టే అని చెప్పాలి. ఈ కేసు నేపథ్యంలో కేసీఆర్‌పై మరోసారి విమర్శలకు దిగేందుకు రేవంత్ రెడీ కాకుండా ఉంటారా..? ప్రయోజనాలు ఏవైనా, ఎవరివైనా రేవంత్‌ను మరోసారి రంగంలోకి తెస్తున్నారు. తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే