రవితేజని స్టార్ ని చేసింది పూరి జగన్నాథే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. రవితేజ సినిమాలతో పూరి కూడా.. హిట్ దర్శకుడు అనిపించుకొన్నాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మాన్నాన ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు.. వీళ్ల కాంబో నుంచి వచ్చిన సినిమాలు. దేవుడు చేసిన మనషులు సినిమాని మినహాయిస్తే.. మిగిలినవన్నీ బాక్సాఫీసు దగ్గర నిలిచి.. గెలిచాయి. నేనింతేకి విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. వీరిద్దరి నుంచీ డబుల్ హ్యాట్రిక్ సినిమా ఎప్పుడొస్తుందా?? అని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జగత్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నా.. అని ప్రకటించాడు రవితేజ. ఇక పూరితో ఆలస్యం అన్నమాట.
ఇటీవల కాలంలో పూరి ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చాడు. తన మిత్రుడ్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనో ఏమో.. పూరి డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు ”మనం కలసి ఓ సినిమా చేద్దాం” అంటూ తన ఆప్త మిత్రుడుకి ఆపన్న హస్తం అందించాడు రవితేజ. కానీ పూరి మాత్రం ఒప్పుకోలేదు. ”నీకు తగిన కథ దొరికినప్పుడే సినిమా చేద్దాం” అన్నాడట. అంతేకాదు. దేవుడు చేసిన మనుషులు సినిమా సరిగా ఆడలేదని.. ఈ సారి సినిమా చేస్తే.. ఆ ఫ్లాప్‌ని కవర్ చేసేలా ఆ సినిమా ఉండాలని పూరి చెప్పాడట. సాధారణంగా ఓ అవకాశం వస్తే.. దాన్ని పక్కన పెట్టడం పూరి స్ట్రాటజీకి విరుద్ధం. హీరో దొరికాడంటే, అప్పటి కప్పుడు కథ అల్లేసి రెడీ అయిపోతాడు పూరి. కానీ రవితేజ విషయంలో మాత్రం.. కాస్త వెనక్కి తగ్గాడు. ఇటీవల ఫేస్ బుక్‌లో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ.. పూరితో సినిమా చేయబోతున్నా అంటూ ప్రకటించేశాడు రవితేజ. ప్రస్తుతం పూరి బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. ఆసినిమాతో హిట్ కొట్టి.. అప్పుడు రవితేజతో జట్టు కట్టాలని పూరి ఫిక్సయ్యాడేమో..! 2017లోనే పూరి – రవితేజ కాంబో పట్టాలెక్కే ఛాన్సుంది.