శుక్రవారం నాడు టీవీ5 మిత్రులు ఒక బైట్ కావాలన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనూ దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్‌తోనూ కలసి ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసే ఆలోచనలో వున్నారని దానిపై స్పందన కావాలని అడిగారు. గద్దర్ నాకు చిరకాల మిత్రుడు కళాకారుడుగా చాలా ఇష్టం.కాని కొన్నేళ్లుగా ఆయన అస్పష్ట రాజకీయాలపై నాకు పెద్ద అభిప్రాయం లేదు. పుష్కరకాలం కిందట మా ప్రస్థానం సాహిత్య సంచిక కోసం ఆయనను సుదీర్థంగా ఇంటర్వ్యూ చేసి ఇంటరాక్ట్ అయినప్పటికే ఒక విధమైన నూతనాన్వేషణలో వున్నారు. పీపుల్స్‌వార్‌తో విబేదించారు గాని తన మార్గం తేల్చుకోలేదు. అయితే ప్రజాస్వామిక ఉద్యమాలకు గొంతుగా కొనసాగుతూనే వున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైనాక అక్కడ కూడా పరిపరివిధాల చర్యలతో తప్పటడుగులు వేశారు. అవన్నీ ఇప్పుడు ఏకరువు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు.
కొద్ది నెలల కిందట ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా పనిచేస్తున్నారన్నట్టు వార్తలు చూశాను. అంతకంటే ఎక్కువగా ఆయన భక్తి కార్యక్రమాలలో కనిపించడం మొదలు పెట్టారు.టివి5లోనే శివరాత్రి సందర్బంలో శివుడిపై భక్తిగీతం పాడారు. చూస్తే అల్లాపైనా పాడినట్టున్నారు. భక్తి విశ్వాసాలు ఆయన ఇష్టమే గాని మార్క్సిజం మావోయిజం అంటున్నప్పుడు కొంత వివరణ సమాధానం ఇవ్వవలసిన బాధ్యత వుంటుంది. ఇంతలోనే ఈ రాజకీయ వేదిక కథనం వచ్చింది. ఇది ఎవరి నుంచి ఎలా వచ్చింది అత్యంత అధికార పూర్వకంగా చెప్పిన వారెవరూ అనే సమాచారం నాకు తెలిసినా చెప్పడం నా పని కాదు, సరికాదు కూడా. పవన్ కళ్యాణ్‌కు దీంతో సంబంధం వున్నట్టు లేదు.రజనీకాంత్‌కూ అసలే లేదు. గతంలోనూ గద్దర్ ఒక పార్టీ పెడతానని చెప్పి తర్వాత ఒక వేదిక ఏర్పాటుకు పరిమితమైనారు. అది కూడా పెద్ద కొనసాగింద లేదు.
ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల ఉనికినే లేకుండాచేయాలన్నంత వ్యూహంతో వుంది. జెఎసి చైర్మన్ కోదండరాం నిరసనను కూడా నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. మరోవైపున ఎందరో మేధావులు బుద్ధిజీవులు కెసిఆర్ కొలువులో చేరిపోయారు. ఇంతకు ముందే చెప్పినట్టు గద్దర్ కూడా సానుకూలంగానే మాట్లాడివున్నారు. మరిఅలాటప్పుడు ఆయన ఏర్పాటు చేసే వేదిక ప్రభుత్వానికి అనుకూలంగా వుంటుందా? వ్యతిరేకంగానా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన పవన్ కళ్యాణ్ దీంతో ఎందుకు భాగం పంచుకుంటారు? ఆయన గద్దర్‌పై గౌరవం వెల్లడించిన మాటనిజమే గాని రాజకీయాలు వేరు.ఇక రజనీ కాంత్ గత ఇరవయ్యేళ్లుగా రాజకీయ ప్రవేశానికి ఆశపడుతూనే వెనక్కుపోతున్నారు. జయలలిత మరణం తర్వాతా అదే చేశారు. ఆయన గద్దర్‌తో కలిసే అవకాశమేమిటి? అవసరమేమిటి?
చూస్తుంటే ఇదంతా ఒక ఆకర్షణీయమైన కథగా తప్ప ఆచరణ సాధ్యమైన వ్యవహారంగా కనిపించదు. గద్దర్ గజిబిజి,వయస్సు ఆరోగ్యం వంటి కారణాల రీత్యా అది మరింత కష్టమవుతుంది. అటాగాక కెసిఆర్ పట్ట సానుకూలంగా వుండేట్టయితే అప్పుడు అసలే విలువ వుండదు. సామాజిక కోణంలో కృషి చేస్తే గద్దర్ వంటివారికి కొంత స్థానముండొచ్చు. దక్షిణాదిన రాష్ట్రాలలో దేని స్థితి దానిదే. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఎపిలకే పోలిక లేనప్పుడు తమిళూనాడు కేరళ గురించి ఏంచెప్పాలి? అందుకే ఇదో అందమైన కథగా మిగిలిపోవచ్చు. ఆ మాటకొస్తే కోదండరాం కూడా ఆమ్ఆద్మీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అలాటి వేదిక ఒకటి ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నామన్నారు. ఎపిలో పవన్ కళ్యాణ్ ప్రవేశం ఏ విస్త్రతిలో వుంటుందో ఇంకా తేలాలి. ముద్రగడ పద్మనాభం కాపు రాజకీయాలు ఒక కొలిక్కి రావాలి. ఇదంతా సమయం పట్టే వ్యవహరమే. ఈలోగా ఇలాటి కథలు చాలా వస్తుంటాయి మరి.