ఆంధ్ర ప్రదేశ్ నూతన శాసనసభ భవనాల ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం వచ్చే ఎన్నికల ప్రచార సరళి ఎలా వుండేది సూచిస్తున్నది. విభజన అన్నది ఒక చారిత్రిక వాస్తవంగా ఆమోదించి మూడేళ్లు గడిచిన తర్వాత ఇవన్నీ మాట్లాడితే కలిగే పర్యవసానాలేమిటో ఆయనకు తెలియవనుకోలేము. కాని కావాలనే మాట్లాడి వుంటారు. ఆ వెంటనే టిఆర్ఎస్ నేతలు సామూహికంగా దాడి చేయడంతో ఆయన లక్ష్యం నెరవేరినట్టే చెప్పాలి. విభజన తర్వాత ఎపి బాంబు దాడి తర్వాతి హిరోషిమాలా వున్నదని కూడా ఆయన ఒక దశలో అన్నారు. తర్వాత అలాటివి మానేశారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి పదేళ్ల ప్రతిపక్ష నాయకుడు గనక విడిపోయినా రెండు చోట్ల తన హవా కొనసాగించుకోవచ్చని మొదట ఆయన భ్రమ పడ్డారు. అందుకే పదేళ్లు ఇక్కడే వుంటానని, తెలంగాణలో తెలుగుదేశంను అధికారంలోకి తెచ్చాకే వెళతానని అంటుండేవారు. అక్కడ చంద్రబాబు ఇక్కడ లోకేశ్ బాబు ముఖ్యమంత్రులవుతారని వీరాభిమానులు చెబుతుండేవారు కూడా. వాస్తవానికి కెసిఆర్ ఉద్యమ నాయకుడుగా విజయం సాధించినా తెలుగుదేశం బిజెపి కూటమికి కాంగ్రెస్‌కు కూడా బాగానే సీట్లు వచ్చాయి. హైదరాబాద్ నగరంలోనైతే కూటమికి చాలా ఆధిక్యత వుండింది. దాన్ని వారు సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఉమ్మడి రాజధాని తద్వారా రెండురాష్ట్రాల రాజకీయాలు మరో విధంగా వుండేవి. ఆ సమతుల్యత కాపాడబడేది. కాని తెలుగుదేశం కొద్ది కాలంలోనే పేకమేడలా కూలిపోవడం మొదలైంది. దాన్ని ఆపలేని తెలుగుదేశం నాయకత్వం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి వంటివారు(లోకేశ్ బాబు సహాయంతో, చంద్రబాబు ఆశీస్సులతో దుస్సాహసకి ఓటుకు నోటు దుస్తంత్రం జరిపి దొరికిపోయారు. అది టిటిడిపి పతనంలో ఆఖరి మెట్టు. తర్వాత కూడా చంద్రబాబు గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేసినా అనువుగాని చోట అధికుల మనరాదు అన్న సత్యం అంగీకరించాల్సి వచ్చింది. అంతె ఉన్న ఫలానా హైదరాబాదునుంచి మాయమై పోయారు. తర్వాత లోకేశ్ కూడా తరలిపోయారు. ఆఖరుకు మనవడు దేవాన్స్ ఆధార్‌కార్డు కూడా అక్కడే తీసుకున్నారట. అంతకు ముందు ఎపిటిడిపి కన్నా టిటిడిపికి సమయం ఇచ్చేచంద్రబాబు ఆసక్తి తగ్గించేశారు. ఇప్పటికీ కొందరు నాయకులు డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్లడం అసహ్యంగా వుందని ఒక సీనియర్ టిటిడిపి నేత మాతో అన్నారు.
ఏమైనా ఇప్పుడు చంద్రబాబుకు తెలంగాణపై రాజకీయ ఆశలు లేవు. ఎపిని నిలబెట్టుకోవడం కొడుకు పట్టాభిషేకం చేసి ములాయం లా లాలూలా కేంద్రంలో చోటు సంపాదించడం ఆయన ఎజెండా. ఆర్థిఖంగా హైదరాబాదుతో ఆయన కుటుంబానికి చాలా సంబంధాలున్నాయి.ఇతర ఆస్తులు ఆర్థిక ప్రయోజనాలూ వుంటాయి. కనుక టిఆర్ఎస్ ప్రభుత్వంతో మంచిగా వుంటారు. ఓటుకు నోటు కేసు పూర్తి కాలేదు గనక కెసిఆర్‌తో ఘర్సణ పెంచుకోరు కూడా. ఇద్దరి మధ్య ఆహ్వానాలు స్వాగతాలు అనేకం ప్రజలు చూశారు. పదో షెడ్యూలు నదీజలాలు వంటి సమస్యలు పరిష్కారం కాకున్నా వెంటనే అయ్యే అవకాశం లేకున్నా పార్టీలుగా వారికి పెద్ద సమస్య కాదు. చర్చలు నడుస్తూనే వుంటాయి. సమయాన్ని బట్టి వాల్యూం పెంచడం తగ్గించడం చేస్తుంటారు.
ఇలాటి సమయంలో జరిగిపోయిన విభజనతో తనకే సంబంధం లేనట్టు చంద్రబాబు చెప్పడం ఒక అవాస్తవమైతే ఆ వెంటనే కట్టకట్టుకుని దాడి చేయడం టిఆర్ఎస్ రాజకీయం. ఉభయులకూ లోలోపల కావాలసినంత అవగాహన వుంది. కాని ఎన్నికల నాటికి మళ్లీ పాత వాదనలు తెస్తే తప్ప ఓటర్లను ఉద్వేగానికి గురి చేయడం కుదరదు. కనుకనే నిప్పు చల్లారకుండా చూడాలి. ఆ గాయాలను గెలుకుతుండాలి. సమైక్య రాష్ట్రంలో అన్యాయాలు, ఆంధ్ర పెత్తనం వంటివి టిఆర్ఎస్ చెబుతుండాలి.విభజన అన్యాయాలను టిడిపి కెలుకుతుండాలి. దీనివల్ల అమాయకులు ఆపరిపక్వ మనస్కులు రెచ్చిపోతుండాలి. అలా పచ్చిగా వుంచితే పెంచడమా లేదా ఎన్నికల సమయంలో చూసుకోవచ్చన్నది ఆలోచన. అయితే ఈ విషయంలో టిఆర్ఎస్కన్నా టిడిపి అధినేతపై బాధ్యతే ఎక్కువ. ఇప్పటికీ ఎపికి చెందిన వేల కుటుంబాల వారు తెలంగాణలో వున్నారు. హైదరాబాద్‌తో ఆయన తెంచుకున్నా వారి పిల్లల ఉద్యోగాలు వ్యాపారాలు ముడి తెగిపోలేదు. రాయలసీమకు సంబంధాలు తెగిపోలేదు. కనక ఆచితూచి మాట్లాడ్డం చాలా మంచిది.ఈ సమస్య కెసిఆర్‌కు పెద్దగా వుండదు. చంద్రబాబులా ఆయన వాటిని మాట్లాడరు కూడా. ఎందుకంటే ఆయన విజయానికి ఆంధ్ర వారి ఓట్లు కూడా కావాలి. పెద్దరికం చూపించాలి. ఎప్పుడైనా ఏదైనా అన్నా పాలకులనే గాని ప్రజలను కాదని సర్దిచెబుతుంటారు. కాకపోతే సోషల్ మీడియాలో గాని అటూ ఇటూ కొన్ని వర్గాలలో గాని చూస్తే పాత పంతాలు ఇంకా తొంగిచూస్తుంటాయి. అత్యధికులు మాత్రం వాస్తవికంగానే వున్నారు. కాబట్టి 9+10+ ప్రస్తుత 3 ఏళ్ల అనుభవం గల చంద్రబాబు అనవసరంగా పాతవి తవ్వి ఎదుటివారికి ఆయుధాలు అందించకుందురు గాక. లేకపోతే అప్పుడు ఓటుకు నోటు చేసిన నష్టానికి మించి ఇప్పుడు మాటలతో చేటు.