తొలి సినిమాకే చాలా కష్టాలు ఎదుర్కున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. లాంటి బిగ్ స్టార్స్ కుటుంబం నుండి వచ్చిన సాయికీ సినిమా కష్టాలు తప్పలేదు. వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాణంలో మొదలైన సాయి తొలి చిత్రం రేయ్.. సినిమా కష్టాల్లో చిక్కుకుంది. దాదాపు మూడేళ్ళు పాటు ఈ సినిమా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడింది. దీంతో సాయి ఇక రేయ్ పై నమ్మకాలు వదులుకొని ‘పిల్లా నీవులేని జీవితం” చేశాడు. ఈ సినిమానే సాయి తొలి సినిమా గా రిలీజ్ అయ్యింది. వెండితెరపై మెగా మేనల్లుడిని చూసిన ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. తన డ్యాన్సులు, యాక్టింగ్ , ఫైట్లలో మేనమామల మేనరిజమ్స్ ను చూపించి అలరించాడు సాయి. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ సినిమా తర్వాత రేయ్ కూడా వచ్చింది. అయితే ఇది దారుణంగా దెబ్బకొట్టింది. సాయి మొదటి సినిమానే రేయ్ అయితే మాత్రం కెరీర్ పై చాలా ప్రభావం పడుండేది. ఈ సినిమా లేట్ కావడం ఒక విధంగా సాయికి మంచే జరిగింది. రేయ్ రిజల్ట్ తనపై పడకుండా గట్టెక్కేశాడు సాయి.
తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ కూడా ఓకే అనిపించింది. కధలో కొత్తధనం లేకపోయినా కొత్త ట్రీట్ మెంట్, దిల్ రాజు లాంటి నిర్మాత గ్రాండియర్ పబ్లిసిటీతో సుబ్రహ్మణ్యం.. సేల్ అయిపోయింది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ”సుప్రీమ్” సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు సాయి. ఈ సినిమా సాయి కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ తెచ్చి పెట్టింది. ఈ సినిమా విజయంతో తన మార్కెట్ ను కూడా ప్రూవ్ చేసుకున్నాడు సాయి. అయితే సుప్రీం తర్వాత అంతే అంచనాలతో వచ్చిన ”తిక్క” సినిమా మాత్రం దారుణంగా పల్టీకొట్టేసింది. అసలు సాయి ఇలాంటి సినిమాని ఎలా అంగీకరించాడు అనే అనుమానాలు వచ్చాయి. అయితే ముందు తీసుకున్న అడ్వాన్స్ కారణంగా ఈ సినిమా చేయాల్సివచ్చిందని చెప్పుకున్నారు. అదే వేరే సంగతి. ఇప్పుడు ”విన్నర్” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. కధలో ఎలాంటి కొత్తదనం చూపించలేదు. పరమరొటీన్ ట్రీట్ మెంట్ తో విసిగించారు.వెరసి సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర చతికిల పడింది.
రేయ్ పక్కన పెడితే.. మిగతా మూడు సినిమాలతో ప్రామెసింగ్ హీరో అనే ముద్రవేసుకున్నాడు సాయి. కాస్త మాస్ ఫాలోయింగ్ కూడా వచ్చింది. కాని ఇప్పుడు వరుసగా రెండు ఫ్లాఫులు పడ్డాయి. ఇవి వెంటనే సాయి కెరీర్ పై ప్రభావం చూపకపోయిన తన మార్కెట్ పై దెబ్బపడే అవకాశాలు అయితే వున్నాయి. ఎందుంటే ఇక్కడ ప్రతి శుక్రవారం జాతకాలు మారుతాయి. సో.. ఇప్పుడు సాయి, కధల,దర్శకులు ఎంపికలో కొంచెం జాగ్రత్త పడాలి. అవే రొటీన్ సినిమాలు చూసే రోజులు పోయాయి. కధలో ఎంతో కొంత వైవిధ్యం వున్నట్లు చూసుకోవల్సిందే. ఇప్పుడు అలాంటి కధలు ఎంచుకొనే బాధ్యత సాయిపైనే వుంది.