✍ వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు అసెంబ్లీకి దూరంగా పెడతారా? ఆమెపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తారా? అమరావతిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు రోజా హాజరవుతారా? ఇప్పుడీ ప్రశ్నలు సస్పెన్స్ గా మారాయి. 2015 శీతాకాల సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు, టీడీపీ మహిళా ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. 2015 డిసెంబర్ 18న ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా. ఇప్పటికే ఆ గడువు ముగిసింది. ఇక సోమవారం నుంచి వెలగపూడిలో కొత్తగా ప్రారంభమైన తాత్కాలిక భవంతిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సస్పెన్షన్ గడువు ముగిసిన నేపథ్యంలో ఈ సమావేశాలకు రోజా హాజరవ్వాల్సి ఉంది.
? కానీ రెండు రోజుల్లో సమావేశాలు ప్రారంభమవుతాయనగా. ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తాను చేసిన వ్యాఖ్యలకు రోజా బేషరతుగా సమాధానం చెప్పలేదని, ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదని భావించిన ప్రివిలేజ్ కమిటీ.. మరో ఏడాది కాలం రోజాపై సస్పెన్షన్ కొనసాగించాలని స్పీకర్ కు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు రోజా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.
? తనను అవమానిస్తూ, అసభ్యకరంగా మాట్లాడారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత శాసనసభ క్రమశిక్షణా సంఘానికి అప్పట్లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘భర్తను వదిలేశారు’ అనే పదం వాడి రోజా తనను ఘోరంగా అవమానించారని అనిత వాపోయారు. అనిత ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ.. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ కు సిఫార్సు చేయగా, స్పీకర్ కోడెల ఆ నిర్ణయాన్ని అమలు చేశారు. దీంతో ఏడాది పాటు రోజా అసెంబ్లీకి దూరమయ్యారు.
? డిసెంబర్ 2016తో ఏడాది కాలం పూర్తయింది.
కేలండర్ ఇయర్ మారింది, అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ నుంచి ఏపీ నూతన రాజధాని అమరావతికి షిఫ్ట్ అయ్యాయి. కానీ రోజా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. చారిత్రక సందర్భంలోనూ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాన్ని రోజా కోల్పోనున్నారు.
? రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ వేయడం సమంజసమే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. తనపై చేసిన ఆరోపణలకు రోజాలో ఎక్కడా పశ్చాతాపం కనిపించడం లేదని ఆమె అంటున్నారు. పైగా ఇప్పటికీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించడం సరికాదన్నారు. అసలు రోజా చేసిన వ్యాఖ్యలకు.. మానసిక స్థైర్యం లేని ఆడవాళ్లు అయి ఉంటే.. ఇంట్లో కూర్చుంటారు, లేదంటే ఉరేసుకుని చచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. నేను మొండిదాన్ని కాబట్టే ఇంకా లేచి తిరుగుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆవిడ మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపం అన్నది కనిపించడం లేదని అనిత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని తాను స్పీకర్ ను కోరుకుంటున్నట్టు అనిత వెల్లడించారు.
? మొత్తంగా ప్రివిలేజ్ కమిటీ తన నిర్ణయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నివేదిస్తే.. స్పీకర్ కార్యాలయం నుంచి రోజా సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
? మరోవైపు ప్రభుత్వం తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పులను నిలదీసినందుకే రోజాను టార్గెట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. టీడీపీ నాయకుల కాల్ మనీ దుర్మార్గాన్ని ప్రశ్నించినందుకు కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై సూటిగా విమర్శలు సంధించే రోజాను ఎదుర్కోనే సత్త లేకనే ఆమెను అసెంబ్లీ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.