చాలా తెలుగు పదాలు మరుగున పడిపోయాయి. కొన్ని పదాలను రాయడమే మానేశాం. సినిమా విషయానికి వస్తే.. సినిమా లాంగ్వేజ్ అంటూ ఇంగ్లీష్, హిందీ, తమిళం .. ఇలా ఆల్ మిక్స్ చేసి ఓ వెరైటీ తెలుగును రాయడం ట్రెండ్ గా మారిపోయింది. పంచ్ కోసం భాషను చిత్ర వధ చేయడం గమనిస్తూనే వున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంత మంది రచయితలు కొన్ని స్వచ్చమైన తెలుగు పదాలు, కమ్మనైనా నుడికారంను చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటి జనరేషన్ కు అర్ధమవ్వడం కోసం దాని ఇంగ్లీష్ అర్ధం కూడా చెబుతుంటారు. త్రివిక్రమ్ సినిమాల్లో ఇది కనిపిస్తుంటుంది. యాదృచ్చికం, సాపత్యం, ఐమోలు.. ఇలాంటి పదాలును వాడి అందులోనే హాస్యం పుట్టిస్తుంటారాయన.
ఈ విషయంలో మరో రచయిత సాయి మాధవ్ బుర్రా గురించి చెప్పుకోవాలి. స్వచ్చమైన తెలుగు రచయిత అనే మాట ఆయనకి సరిపోతుంది. మిగతా సినిమాలు మాట ఏమిటో కానీ క్రిష్ తో ఆయన పని చేసిన సినిమాలకు ఒక్క ఇంగ్లీష్ పదం రాకుండా జాగ్రత్తపడి తెలుగు మాటలతో తూటాలు పేల్చిన రచయిత బుర్రా. ఈ మధ్య వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సంభాషణలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా చివర్లో ”సాహో” శాతకర్ణి అనే ఓ మాట రాశారు బుర్రా. సాహో.. అనే మాట ఆయనేం పుట్టించలేదు. భాషలో ఉన్నదే. అయితే ఆయన వెతికి మళ్ళీ పట్టుకున్నారు. మళ్ళీ చెవికి వినిపించారు. ఇది చాలా మందికి నచ్చేసింది.
ఎంతలా నచ్చిందటే బాహుబలి పార్ట్ 2 లో ఏకంగా ఈ మాటతో పాటే వచ్చింది, సాహోరే బాహుబలి అంటూ జనం ఊగిపోయారు. సాహో అనే మాట బాహుబలి మొదటి బాగంలో ఎక్కడా వినిపించలేదు. పార్ట్ 2లో ఏకంగా పాటే అంటే..అది బుర్రా మాట మహిమే. అక్కడితో ఆగలేదు. ప్రభాస్ కొత్త సినిమాకి ఏకంగా సాహో అనే టైటిల్ నే పెట్టేశారు. ఇప్పుడు మరో సినిమాలో సాహో వినిపించింది. అల్లు అర్జున్ కొత్త సినిమా డిజే. ఈ సినిమా నుండి ఓ పాట విదుల చేశారు. ఈ పాటలో కూడా సాహో అనే మాటను వాడారు. మొత్తమ్మీద శాతకర్ణి కోసం బుర్రా రాసుకున్న మాట .. ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. ఈ సందర్భంగా బుర్రాకు థాంక్స్ చెప్పుకోవాల్సిందే.