డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలుస్తోంది. ఈ కేసులో కొంతమంది సినీ ప్రముఖలను సిట్ విచారిస్తోంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ విచారించిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకూ ఈ కేసుపై ప్రభుత్వ వర్గాలు, సినీ పరిశమ్రకు చెందినవారి స్పందనే తప్ప… రాజకీయ పార్టీల మధ్య పెద్దగా చర్చకు దారితీసిన పరిస్థితి లేదు! అయితే, ఇప్పుడీ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంటోంది. తెలంగాణలో సంచలనంగా మారిన ఈ కేసుపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఈ కేసును ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ కు ఆయన పరోక్షంగా లింక్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
‘తెలంగాణలో అతిపెద్ద డ్రగ్స్ స్కామ్ బయటపడింది. దీనిలో అధికార పార్టీ వారసుడికి సంబంధించిన మిత్రులు కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారిని కూడా విచారణకు పిలుస్తారో, లేదా వదిలేస్తారో చూడాలి’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా మంత్రి కేటీఆర్ ను ఈ వ్యవహారంలోకి లాగారు. దీంతో తెరాస వర్గాలు ఒక్కసారిగా విమర్శలు గుప్పించాయి. అయితే, ఈ ట్వీట్ పై ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మంత్రి కేటీఆర్ కూడా స్పందించేశారు. దిగ్విజయ్ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంటనే రిప్లై ఇస్తూ కౌంటర్ వేశారు. సీనియర్ నేత అయిన తమరు విచక్షణను పూర్తిగా కోల్పోయారనీ, త్వరలోనే రిటైర్మెంట్ తీసుకుంటే గౌరవప్రదంగా ఉంటుందనీ, వయసుకు తగ్గట్టుగా నడుచుకుంటేనే బాగుంటుందంటూ కాస్త ఘాటుగానే కేటీఆర్ ట్వీటారు. తెలంగాణ స్పెల్లింగ్ సరిగ్గా రాయడం నేర్చుకున్నందుకు ధన్యవాదాలు అంటూ కాస్త వెటకారం జోడించారు.
కేటీఆర్ సమాధానంపై మళ్లీ దిగ్విజయ్ స్పందిస్తారేమో చూడాలి. మొత్తానికి, ఈ డ్రగ్స్ ఇష్యూ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య విమర్శలూ ప్రతి విమర్శలకు కారణం కాబోతోంది. దిగ్విజయ్ సింగ్ పై కేటీఆర్ చేసిన కామెంట్స్ వ్యక్తిగతంగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారనే చెప్పాలి. ఇంతవరకూ సినీ పరిశ్రమ మీదే విమర్శలు వినిపించాయి. ఇకపై, ఇది అధికార పార్టీ వైఫల్యమని ప్రతిపక్షాలు… గత పాలకుల నిర్వాకమే అని అధికార పార్టీ నేతలు వాదులాటకు దిగుతారేమో..! నిజానికి, ఇతర కేసులతో పోల్చితే డ్రగ్స్ కేసు విషయంలో తెరాస సీరియస్ గానే ఉందని అనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ నయీం, ఓటుకు నోటు కేసులు మాదిరిగానే దీన్ని కూడా నీరు కార్చేలా ప్రభుత్వం తీరు ఉంటోందన్న విమర్శలు మొదలవగానే… అకున్ సబర్వాల్ సెలవును రద్దు చేయించారు. ఈకేసులో తెరాస మంత్రులున్నా వదిలిపెట్టొద్దని కూడా సీఎం ఆదేశించారు. సో… ఈ కేసు దర్యాప్తుపై ఏ స్థాయి నేతలు ఏ చిన్నపాటి విమర్శ చేసినా కేటీఆర్ ట్వీట్ మాదిరిగానే సీరియస్ రిటార్టులు ఉంటాయనడంలో సందేహం లేదు.