ఇటీవల కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంలో నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రి కావడం పట్ల అందరిలో హర్షం వ్యక్తమైనా చాలామందికి ఆశ్చర్యం కూడా కలిగింది. ఫ్రధాని నరేంద్రమోడీ అంతగా అభిమానించని ఆమెకు కీలక శాఖ ఎలా దక్కిందా అని అనేకులు ప్రశ్నించారు. వాస్తవంలో నిర్మలతో రాజీనామా చేయించి తమిళనాడుకు పంపించనున్నట్టు లీకులు కూడా వచ్చాయి. కాని హఠాత్తుగా ఆమె దేశంలోనే తొలి మహిళా రక్షణ మంత్రి కాగలిగారు. ఇందుకు ఏకైక కారణం ఆరెస్సెస్ ఆశీస్సులేనని అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆరెస్సెస్ రెండు రకాలుగా ఎంపికలు చేస్తుంది. ఒకటి సంఘం సిద్దాంతాల పట్ల విధేయత. రెండోది వారి ఉద్దేశంలో సమర్థత. ప్రధాని మోడీ ఎంపిక కూడా ఈ ప్రకారమే జరిగింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఒక మహిళా నేతగా ముందు ముందు బాగా ఉపయోగపడతారని సంఫ్‌ు పెద్దలు అంచనా వేస్తున్నారు. సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో పాటు సృతి ఇరానీ వివాదాల్లో చిక్కుకుపోవడం కూడా ఆమె పట్ల మొగ్గు తగ్గించిందట. ఇక మిగిలింది ఉమాభారతి. ఆమె సరిగ్గా పనిచేయడడం లేదు గనక తొలగించాలనుకుంటే ఆరెస్సెస్ అడ్డుపడి కొనసాగాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్‌తో సహా ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నప్పుడు హిందూత్వ సన్యాసినిగా దూకుడుగా వుండటమే గాక ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా వున్న ఉమాభారతిని తగ్గించడం మంచిది కాదని వారు భావించారట. ఆ భరోసా వుండబట్టే ఆమె కూడా మోడీ అంటే బేఖాతర్గా వ్యవహరించారు.
ఈ ప్రహసనంలో కాస్త అపహాస్యం పాలైంది ఎపి బిజెపి అద్యక్షుడు కంభంపాటి హరిబాబే. మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ఆయనకు కేంద్ర మంత్రులే సందేశం పంపించారు. అయితే ప్రధాని కార్యాలయం నుంచి మాత్రం కాదు. మరో రాజ్యాంగ పదవిలో వున్న తెలుగు నేత ఈ కబురు పంపించి వుంటారని ఒక కథనం. పైగా హరిబాబు ఏదో మామూలుగా వెళ్లడం గాక గొప్ప ప్రచారం చేసుకున్నారు. ఆయన పిఎ అయితే బయోడేటా కూడా పంపించారు. ఇదంతా ముగిసి ఢిల్లీలో దిగగానే తనకు సన్నిహితుడైన మంత్రికి ఫోన్ చేశారు. జాబితాలో నేను చూసినప్పుడైతే నీ పేరుంది గాని చివరి జాబితాలో వుందో లేదో చెప్పలేనని ఆయన తప్పుకున్నారు. అంటే ఆ తర్వాత ఆరెస్సెస్ ఆ పేరును తొలగించిందన్నమాట. అలా పదవి ఆశగానే మిగిలిపోయింది.ఇక బండారు దత్తాత్రేయ తొలగింపు విషయానికి వస్తే ఆయన సన్నిహితులైన వారు ఆయనను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని నివేదికలందాయట. దానిపై ఒకసారి హెచ్చరించారట కూడా. అయినా మార్పు రాలేదు గనక ఆరెస్సెస్ అంగీకారంతోనే తొలగించారన్నది అధికార వర్గాల కథనం.