లక్షకోట్ల హైద్రాబాద్‌ మిషన్‌

రోజుకు రోజు మీడియాకు కొత్త పథకాలతో శీర్షికలివ్వడం, అవతలివారిపై దూకుడుగా మాట్లాడి కొన్ని రోజులు అటు వైపు దృష్టి మళ్లించడం లేనిపోనిసమస్యలు తీసుకురావడం టిఆర్‌ఎస్‌ సర్కారుకు పరిపాటి. అందులోనూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిరంతర వ్యూహరచనలో ప్రవచనాలలో మునిగితేలుతుంటారు. గ్రామాలలో అనేక పథకాలతో ప్రచారం పొందినా కేంద్రబిందువైన హైదరాబాదులో పరిస్థితులు మెరుగుపడలేదనే అసంతృప్తి బాగా వుంది.ఈ విషయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దగా చేసింది లేదనే భావన కూడా బలంగా వుంది. మెట్రో రైలు పుణ్యాన చాలా చోట్ల రోడ్ల తవ్వకాలు మళ్లింపులు ఇటీవలి భారీ వర్షాలు పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చాయి. కార్పొరేషన్‌ ఎన్నికల్లో దాదాపు సీట్లన్నీ అప్పగించినా, స్వయంగా కెటిఆర్‌ బాధ్యత వహిస్తున్నా మెరుగుదల రాకపోవడం విశ్వనగరం మాటలకే పరిమితం కావడం మీడియాలోనూ తరచూ ప్రస్తావనకు వస్తున్నది. ఇవన్నీ గమనించి కావచ్చు ఇప్పుడు నగరాభివృద్ది కోసం లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్‌ తీసుకురావాలని ముఖ్యమంత్రి తలపెట్టినట్టు కథనాలు విడుదలవుతున్నాయి. నిజానికి ఇప్పటికే ఆర్థిక పరిస్తితులు బాగాలేక కార్పొరేషన్‌ అప్పుల కోసం వెళ్లనున్నదనే వార్తలు కూడా వున్నాయి. ఆర్టీసీతో సహా పలు భారాలు కార్పొరేషన్‌పై నెట్టేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాటప్పుడు మిషన్‌కాకతీయ, భగీరథ బాగా ప్రచారం పొందాయి గనక మిషన్‌ హైదరాబాద్‌ అంటే సరిపోతుందని ప్రభుత్వం అనుకోవచ్చు. తర్వాత అది జరక్కపోతే ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా వుంటుంది. లేనిపోని హడావుడి కంటే ముందు చేయగలిగిన తక్షణ సదుపాయాలు చేపట్టడం మంచిది. లక్షకోట్ల వంటి మాటలు తర్వాత చూసుకోవచ్చు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.