నో డౌట్… తెలుగు సినిమానే కాదు, యావత్ భారతీయ సినిమా రూపు రేఖల్ని మార్చేసిన సినిమా ‘బాహుబలి’.
ఎవరు ఊహించారు.. ఇంత పెద్ద కాన్వాస్?
ఎవరు అంచనా వేశారు.. ఇన్నేసి కోట్ల వసూళ్లు?
ఓ ప్రాంతీయ సినిమా, సరిహద్దుల్ని దాటుకొని అంతర్జాతీయ స్థాయిలో నిలబడుతుందని ఎవరు కలగన్నారు?
ఆ సెట్లేంటి?
ఆ వరల్డ్ బిల్డింగ్ ఏమిటి?
ఆ క్యారెక్టరైజేషన్లేమిటి?
ఆ ఇమాజినేషన్ ఏమిటి?
ఎవరు లెక్కగట్టినా, లేకపోయినా, ఎవరు కలగన్నా లేకపోయినా రాజమౌళి మాత్రం ఊహించారు. తెలుగు సినిమాని ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చోబెట్టొచ్చని నమ్మారు. కష్ట పడ్డారు. ఫలితం సాధించారు. ఇప్పుడు ఆ అద్భుతానికి పదేళ్లు.
బాహుబలితో తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. భాషతో సంబంధం లేకుండా అందరూ ఈ చిత్రరాజాన్ని తమ భుజాలపై వేసుకొన్నారు. ఓ సినిమాకున్న పవర్ ఏమిటో చాటి చెప్పిన అద్భుతం ఇది.
తెలుగు సినిమా అంతకు ముందు ‘బిఫోర్ శివ – ఆఫ్టర్ శివ’గా అభివర్ణించేవారు. ఇప్పుడు ఇండియన్ సినిమాని ‘బిఫోర్ బాహుబలి – ఆఫ్టర్ బాహుబలి’గా విడగొట్టి చూడాల్సిందే. బాహుబలితో చాలా లెక్కలు మారిపోయాయి. `ఓ సినిమాకి ఇంతే ఖర్చు పెట్టాలి` అనే నియమం లేదు. సినిమాలో విషయం ఉంటే, అది ఎంతైనా రాబడుతుంది అనే ధైర్యాన్ని నమ్మకాన్ని నూరిపోసిన సినిమా ఇది. కంటెంట్ పై నమ్మకం ఉంటే.. ఎంతైనా ఖర్చు పెట్టొచ్చన్న ధీమా నిర్మాతలకు కలిగించింది. ఓ సినిమాని ఎక్కడైనా మార్కెటింగ్ చేయొచ్చని నిరూపించింది.
పార్ట్ 2 ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది బాహుబలినే. ఆ తరవాత చాలా సినిమాలు బాహుబలిని ఫాలో అయ్యాయి.. అవుతున్నాయి. ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టడం ఏమిటి? అని చాలామంది అప్పట్లో సందేహాలు వ్యక్తం చేశారు. కానీ కథ విస్త్రతం అయినప్పుడు, బడ్జెట్ సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించి, అందులో విజయం సాధించారు రాజమౌళి.
బాహుబలి 1 విడుదలైనప్పుడు.. టాక్ అంతంతమాత్రమే. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన వాళ్లంతా నిట్టూర్చారు. నెగిటీవ్ రివ్యూలూ వచ్చాయి. కానీ.. ఆ టాక్ని, నిట్టూర్పులనూ దాటుకొంటూ బాహుబలి అంచనాలకు అందని అద్భుతాన్ని సృష్టించింది. పార్ట్ 2 అయితే… ఎలాంటి నెగిటీవ్ టాక్ లేదు. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అందుకే ఊహకు అందని వసూళ్లు అందుకొంది.
బాహుబలి పేట్రన్ లో చాలా సినిమాలు పురుడు పోసుకొన్నాయి. పాన్ ఇండియా మోజు పెరిగింది. పెద్ద స్టార్ల సినిమాలన్నీ పాన్ ఇండియాలు అయిపోయాయి. ‘స్టార్ ఉంటే సరిపోదు.. అందరికీ నచ్చే కంటెంట్ కావాలి’ అనే విషయాన్ని మేకర్స్ మర్చిపోవడం వల్ల డిజాస్టర్లు వచ్చి పడ్డాయి. పాన్ ఇండియా సినిమా అంటే.. ఒక్కో భాష నుంచి ఒక్కో నటుడ్ని తీసుకోవాలన్నది బండ సూత్రంగా మారిపోవడం వల్ల, మరుగున పడిపోయిన ఒకప్పటి స్టార్ల కెరీర్ మళ్లీ తారాపథాన దూసుకెళ్లింది. ఎప్పుడూ అందుకోనంత రెమ్యునరేషన్లు వాళ్ల ఖాతాల్లో పడిపోయాయి. ఓరకంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు స్వర్ణయుగం ప్రారంభమైంది. కాకపోతే అతి సర్వత్రా వర్జియత్ అన్నట్టు… ప్రతీ సినిమాలోనూ అవసరం ఉన్నా, లేకున్నా పరాయి భాషా నటుల్ని తీసుకొచ్చి నిలబెట్టేయడం, వాళ్ల ఇమేజ్‌కు, కెపాసిటీకి తగిన పాత్రలు రాయలేకపోవడం వల్ల అదీ మొహం మొత్తేసింది.
బాహుబలి ఇంత కొట్టేసింది, మనకూ ఆ ఛాన్స్ వుంది.. అనుకొన్ని నిర్మాతలు బడ్జెట్లు పెంచుకొంటూ పోయారు. వరల్డ్ బిల్డింగ్ అంటూ అనవసరమైన ఖర్చొకటి. సెట్లూ, వీఎఫ్ఎక్స్ బడ్జెట్లు కొండెక్కేశాయి. హీరోల పారితోషికాలకైతే లెక్కేలేదు. అలా.. సినిమాల బడ్జెట్లు నిర్మాతల చేతుల్లోంచి దాటుకొంటూ వెళ్లిపోయాయి. అవసరం ఉన్నా లేకున్నా పార్ట్ 2 అంటూ హడావుడి చేసి చేతులు కాల్చుకొన్నారు. కొన్ని పార్ట్ 2లు ఆడాయి.. చాలా వరకూ నిర్మాతల్ని ముంచేశాయి. ఇది కూడా ఓరకంగా బాహుబలి ఎఫెక్టే.
ప్రతీ సినిమా బాహుబలి కాదన్న విషయం నిర్మాతలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ప్రతీ సినిమానీ పాన్ ఇండియా చేయాల్సిన అవసరం లేదన్న నిజం వాళ్లకూ మెల్లమెల్లగా అర్థం అవుతోంది. ఈ మాయలోంచి నిర్మాతలంతా బయటపడాల్సిన అవసరం వుంది. ప్రతీ దశాబ్దంలోనూ ఓ సినిమా వచ్చి, అప్పటి వరకూ సినిమా పట్ల ఉన్న అభిప్రాయాల్ని మార్చి, ఓ తలమానికంగా మారుతుంది. ఆ ప్రభావంలో చాలా సినిమాలు పుట్టుకొస్తాయి. ఆ ట్రెండ్ పదేళ్ల పాటు కొనసాగుతుంది. బాహుబలి విషయంలో అదే జరిగింది.. అదే జరుగుతోంది. బాహుబలిని బీట్ చేసే మరో సినిమా వచ్చేంత వరకూ ఈ మాయలో కొట్టుకుపోతుంది చిత్రసీమ. మరి బాహుబలిని మరపించే సినిమా వస్తోందా? రాజమౌళి కాకుండా అలాంటి స్టామినా ఉన్న సినిమాని, మేకర్స్ ఆలోచనల్ని మార్చగలిగే చిత్రాన్ని మరొకరు తీయగలరా?