శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో జీవితంలో పైకి ఎదిగామని భావించే భక్తులు అందరూ.. ఆ స్వామికి ఎంతో కొంత మొక్కులు చెల్లిస్తూనే ఉంటారు. చాలా మంది కోట్లకు కోట్లు విరాళం ఇస్తూంటారు. కొంత మంది నాలుగైదు కేజీల బంగారంతో ఆభరణాలు చేయిస్తూ ఉంటారు. అయితే ఓ భక్తుడు ఏకంగా 121 కేజీల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ విషయం బయటకు తెలియదు. గోప్యంగా ఉంచాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ4 ప్రారంభ కార్యక్రమంలో ఈ విషయాన్ని చెప్పారు.
ఓ వ్యక్తి అమెరికాలో కంపెనీ పెట్టి విజయవంతం అయ్యారు. అందులో అరవై శాతాన్ని అమ్మేశారు. దానికి ఆరేడు వేల కోట్ల రూపాయలు వచ్చాయి. శ్రీవారిపై భక్తితో 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తన విరాళం ఆజ్ఞాతంగా ఉండాలని బయటకు రాకూడదని అనుకున్నారు. భక్తులు కోరుకుంటే వారి పేర్లను గోప్యంగా ఉంచుతుంది టీటీడీ. అలా.. ఈ భక్తుడు ఇచ్చిన విరాళం గురించి బయటకు తెలియలేదు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని బయట పెట్టారు కానీ ఎవరన్నది చెప్పలేదు.
కానీ 121 కోట్లే ఎందుకు విరాళం ఇచ్చారన్నదానికి మాత్రం ఆ భక్తుడు సమాధానం ఇచ్చాడు. తిరుమల శ్రీవారికి నిత్యం చేసే పూజల్లో 120 కేజీల బంగారారన్ని ఉపయోగిస్తారని అందుకే తాను ఆ మొత్తానికి సరిపడా బంగారాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పాడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అంత మొత్తం బంగారం రోజువారీ అలంకరణకు ఉపయోగిస్తారని తనకు కూడా తెలియదన్నారు. కారణం ఏదైనా.. భక్తితో దేవునికి సమర్పించుకునేది ఎంత విలువైనదేనా.. దేవుడు ఇచ్చిందేనని భక్తులు భావిస్తారు.