వివేకా హత్య కేసులో ఏ 2గా ఉన్న సునీల్ యాదవ్.. సీబీఐ కోర్టులో అనూహ్యమైన కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొనసాగించాల్సిందేనని ఇంకా చాలా విషయాలు తేలాల్సి ఉందని సునీల్ యాదవ్ తన కౌంటర్ లో స్పష్టం చేశారు. సీబీఐ విచారణ కొనసాగించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా కోర్టు నోటీసులు ఇవ్వడంతో సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేశారు.
వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి , వైఎస్ భాస్కర్ రెడ్డి అసలు విచారణ వద్దని కౌంటర్ దాఖలు చేస్తే.. ఏ 2 సునీల్ యాదవ్ మాత్రం.. విచారణ కొనసాగించాల్సిందేనని అడగడం ఆశ్చర్యకరంగా మారింది. బెయిల్ వచ్చిన తరవాత సునీల్ యాదవ్ .. అప్రూవర్ తరహాలో మాట్లాడుతున్నారు. పాత్రధారుల్ని ఇరికించేసి.. సూత్రధారులంతా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన అంతా మెల్లగా బయట పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే దస్తగిరి అప్రూవర్ అయ్యారు. ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా అదే తరహాలో నిజాలు బయట పెడితే.. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు బయట ఉండటానికి ఎక్కువ రోజులు అవకాశం ఉండదు. త్వరలోనే వారి గుట్టు రట్టు చేసి జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. అందరి అఫిడవిట్లను పరిశీలించి.. వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టు.. తదుపరి విచారణ కొనసాగించాలా వద్దా అన్నదానిపై తీర్పు చెప్పనుంది.