ఇండియా కూటమి కట్టి ఎన్డీఏను ఓడించాలని చేసిన ప్రయత్నాలు ఎవరికి వారే అన్నట్లుగా మారిపోవడంతో ఆ కూటమిలోని పార్టీలన్నీ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. రాష్ట్రాల వారీగా పొత్తులు ఉన్న పార్టీలు మాత్రమే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇండీ కూటమి అని చెప్పుకుంటున్నాయి. కానీ అలాంటి ప్రభావం కనిపించడం లేదు. తాజాగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తాము ఇండీ కూటమిలో భాగం కాదని ప్రకటించింది. దాంతో ఆ కూటమి మరింత బలహీనపడినట్లయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కోల్పోయింది. ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీ పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ లా అయింది. ఆ తర్వాత ఇండీ కూటమిలో చేరారు కేజ్రీవాల్. కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో సీట్లు ఇవ్వడానికి నిరాకరించింది. హర్యానాలో సీట్లు ఇవ్వకపోవడంతో ఒంటరిగా పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. హర్యానాలో పొత్తు వద్దనుకున్నారు కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్ని కేజ్రీవాల్ వద్దనుకున్నారు. అక్కడా కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇక ఏ రాష్ట్రంలోను కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేది లేదని కేజ్రీవాల్ చెప్పారు.
చివరికి కాంగ్రెస్ పార్టీ నీడ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇండియా కూటమి కకా వికలం అయింది. పార్లమెంట్ సమావేశాలకు ముందు జరగబోయే ఇండీ కూటమి మీటింగ్లో పాల్గొనేది లేదని ?ఆప్ ప్రకటించింది. ఇక ఏ విధంగానూ ఇండియా కూటమిలో తాము భాగం కాదని అధికారికంగా ప్రకటించింది. బీజేపీ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో దాడులు ఎదుర్కొలేమన్న ఓ కారణం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి ఓ కారణం అనుకోవచ్చు.