ఆమాద్మీ పార్టీ అధినేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి ఆ రాష్ట్రంలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కలలుకంటున్న ఆయనకి పంజాబ్ ఆమాద్మీ నేతలు పెద్ద షాక్ ఇచ్చారు. సుచాసింగ్ చోటేపూర్ అనే సీనియర్ నేతపై అవినీతి ఆరోపణలు రావడంతో అరవింద్ కేజ్రీవాల్ ఆయనని పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ ఆయనని పార్టీ నుంచి బహిష్కరించినందుకు పంజాబ్ ఆమాద్మీకి చెందిన 12మంది సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సుచాసింగ్ చోటేపూర్ మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని కోరుతూ ఒక లేఖ వ్రాశారు. అంతేకాదు ఆయనని బహిష్కరించమని సిఫార్సు చేసిన 21మంది నేతలపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తిని అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోనట్లయితే పార్టీని విడిచిపెట్టడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.
పంజాబ్ లో రాజకీయ పరిస్థితులు ఆమాద్మీ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని, కనుక వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలవవచ్చని కలలు కంటున్న అరవింద్ కేజ్రీవాల్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. వారి డిమాండ్లకి అంగీకరించినా, అంగీకరించకపోయినా కూడా పార్టీకి చాలా నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. ఎన్నికలకి సిద్దం అవుతున్న సమయంలో పార్టీ నిలువుగా చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ఆయన ఊహించని పరిణామమే.
అయితే ఈ సమస్యకి ఒక పరిష్కారం కూడా కనబడుతోంది. ఆమాద్మీ పార్టీలో చేరాలని భాజపాకి గుడ్ బై చెప్పేసి బయటకి వచ్చేసిన నవ జ్యోత్ సింగ్ సిద్దూ తనని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ సిద్దూని పార్టీలోకి ఆహ్వానించి ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే తిరుగుబాటు చేస్తున్న నేతలందరినీ గాడిలో పెట్టి పార్టీని గెలిపించుకోవలసిన భాద్యత ఆయనదే అవుతుంది కదా!