‘అప్పు’ ప‌ట్టిన బుల్లెట్‌

ఏ సినిమా అయినా, విడుద‌ల‌కు ముందు పురిటి నొప్పులు ప‌డ‌డం స‌హ‌జం. ఫైనాన్సియ‌ర్ల ద‌గ్గ‌ర్నుంచి, లాబుల ద‌గ్గ‌ర్నుంచి క్లియ‌రెన్సులు తీసుకురావ‌డానికీ, విడుద‌ల‌కు మార్గం సుగ‌మం చేసుకోవ‌డానికీ నిర్మాత‌ల త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తుంటుంది. ప్ర‌స్తుతం ఆర‌డుగుల బుల్లెట్ ప‌రిస్థితీ అలానే ఉంది. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ గోపీచంద్ చిత్రం ప్ర‌స్తుతం.. విడుద‌ల‌కు ముందు తీవ్ర అల‌జ‌డిని ఎదుర్కొంటోంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొద‌లైన సినిమా ఇది. బ‌డ్జెట్ చేయిదాటి పోవ‌డం, నిర్మాత జేబులు ఖాళీ అవ్వ‌డంతో ఈ సినిమా ఆగిపోయింది. చివ‌ర్లో పీవీపీ సంస్థ ఆర్థిక స‌హాయం అందించ‌డంతో సినిమా పూర్త‌య్యింది. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈత‌రుణంలో ఈ సినిమాకి అప్పు ఇచ్చిన ఫైనాన్సియ‌ర్ల నుంచి ఒత్తిడి వ‌స్తోంద‌ట‌. మా ఎమౌంట్లు క్లియ‌ర్ చేయండి… అంటూ నిర్మాత‌పై ఒత్తిడి తీసుకొస్తున్నార్ట‌. పీవీపీ సంస్థ దాదాపు రూ.16 కోట్లు స‌ర్దింద‌ని తెలుస్తోంది. మాకూ సెటిల్ చేయండి.. అంటూ పీవీపీపై ఫైనాన్సియ‌ర్లు ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని తెలుస్తోంది. ”విడుద‌ల అయిన త‌ర‌వాత చూద్దాం” అని ఎంత స‌ర్దిచెబుతున్నా అప్పుల‌వాళ్లు వ‌ద‌ల‌డం లేద‌ట‌. ”మొత్తం అవ‌స‌రం లేదు. క‌నీసం ఎంతో కొంత స‌ర్దండి.. మిగిలిన‌వి త‌ర‌వాత చూద్దాం” అని ఫైనాన్సియ‌ర్లు మ‌ధ్యే మార్గాన్ని ఎంచుకొన్నార్ట‌. ఈ బాకీలు క్లియ‌ర్ చేయాల్సిన బాధ్య‌త కూడా పీవీపీనే తీసుకొంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా విడుద‌లై క‌నీసం రూ.25 కోట్లు తెచ్చుకొంటేనే త‌ప్ప‌…. ఈ అప్పుల బాధ త‌ప్ప‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com