జగన్ రెడ్డి హయాంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ చేసిన దందా గురించి అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఎన్నో ఆరోపణలు చేసింది. చివరికి అధికారంలోకి వచ్చాక ఎవరూ మాట్లాడటం లేదు. కానీ ఇప్పుడు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గళం విప్పారు. కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన.. ఇప్పుడు ఏపీ ఎస్పీడీసీఎల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని..సీబీఐ,ఈడీ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే దోచి పెట్టారు !
ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్, సబ్స్టేషన్ల ఇలా ఏ పని అయినా, వస్తువు అయినా కాంట్రాక్ట్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కే వెళ్తుంది. వచ్చే పది, ఇరవై ఏళ్లకు సరిపడా ట్రాన్స్ ఫార్మర్లను కొనేసి..ఆ సంస్థ గోడౌన్లలోనే ఉంటారు. ధరలను 20–50% అధికంగా చూపి దోచుకున్నారు. ఈ ఆరోపణలతో పాటు ఏబీ వెంకటేశ్వరరావు చాలా విషయాలను బయట పెడుతున్నారు. గ్రామీణ విద్యుదీకరణ పథకంలో టెండర్ కేటాయింపు నుండి అమలు వరకు 30 శాతం లంచాలు తీసుకున్నారని.. పట్టణ ప్రాంతాలలో భూగర్భ కేబుల్ ప్రాజెక్టుల ఆలస్యం నిధుల దుర్వినియోగానికి అవకాశంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
ఏబీవీ చేసిన ఆరోపణలు అన్నింటికీ డాక్యుమెంట్లు
స్మార్ట్ మీటర్ల కోసం రూ. 1,200 కోట్ల టెండర్‌ను నాణ్యత పరీక్షలలో విఫలమైన వెండర్లకు కేటాయించారు. నష్టాల తగ్గింపు కోసం కేంద్రం నుండి వచ్చిన రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ నిధుల దుర్వినియోగం చేశారని చెబుతున్నారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లనూ ఆయన చూపుతున్నారు. నిజానికి ఈ వివరాలన్నీ ప్రభుత్వానికి.. ముఖ్యంగా టీడీపీకి తెలియనిని కావు. ఏబీవీ చెప్పే వరకూ ఎవరికీ తెలియవని కూడా కాదు. తెలిసినా..తెలియినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోదా ?
ఏబీ వెంకటేశ్వరరావు బయట పెట్టిన అంశాలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. విచారణ చేయించే ఆలోచన చేయడం లేదు. అలాంటి అవకాశం ఉందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఏబీవీ మాత్రం తన పోరాటం తాను చేస్తున్నారు. సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని..
సీబీఐ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2019–2025 మధ్య జరిగిన అన్ని టెండర్లు , ఆడిట్లను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
