హైదరాబాద్ లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపుగా ఉన్న మైహోం కొత్త సీఈవోగా అభిషేక్ కపూర్ ను నియమించుకున్నారు. ఇప్పటి వరకూ సీఈవోగా బయట వ్యక్తులు ఎవరూ ఉండలేదు. అంతా జూపల్లి రామేశ్వరరావు కుటుంబమే చూసుకునేది. కుటుంబ వ్యాపారంగానే నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం విభిన్నంగా ఆలోచించారు. రియల్ ఎస్టేట్ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన అభిషేక్ కపూర్, గతంలో పుర్వాంకర లిమిటెడ్‌లో గ్రూప్ సీఈఓ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
పూర్వాంకర రియల్ ఎస్టేట్ కంపెనీని అభిషేక్ కపూర్ బెంగళూరు , చెన్నై వంటి మార్కెట్లకు విస్తరించారు. ముంబై మార్కెట్లో కూడా కంపెనీ విస్తరణకు ఆయన నాయకత్వం వహించారు. 2025 మేలో ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు మైహోంలో చేరారు. మైహోం ప్రధానంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా వ్యాపారం చేస్తోంది. కానీ ఇక నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రాంతాల్లోకి విస్తరించడానికి ప్లాన్ చేసుకుంటోంది. మైహోం కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం 50 మిలియన్ చదరపు అడుగుల కన్‌స్ట్రక్షన్‌ను డెవలప్మెంట్లో కలిగి ఉంది.
మైహోం రామేశ్వరరావు మెల్లగా కుటుంబ వ్యాపారాన్ని కార్పొరేట్ తరహా వ్యాపారంగా మార్చాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ కీలకమైన స్థానాల్లో కుటుంబసభ్యులే ఉంటారు. నిర్ణయాలు వారే తీసుకుంటారు. కానీ ప్రొఫెషనల్ వ్యవస్థను నిర్మించి.. నాయకత్వ లోపాలు లేకుండా సంస్థ నిరాటంకంగా .. కార్యకలాపాలు నిర్వహించేలా ఓ వ్యవస్థను నిర్మించాలని మైహోం ఫౌండర్ రామేశ్వరరావు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇక మైహోం ప్రాజెక్టుల్ని ఇతర మెట్రో నగరాల్లోనూ విరివిగా చూడవచ్చు.