కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్ ని 3-0తో ఇప్పటికే కైవసం చేసుకొంది. ఈరోజు గౌహతిలో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో పూర్తి చేసి తన సత్తా చాటింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 20 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 57 నాటౌట్(26) ఆఫ్ సెంచరీతో ఆకట్టుకొన్నాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్ పై కూడా.. పరుగులు సాధించలేక తంటాలు పడింది. బుమ్రా 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకొన్నాడు. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. న్యూజీలాండ్ బ్యాటర్లలో ఫిలిప్స్ (48) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ కు తొలి బంతికే ఎదురు దెబ్బ తగిలింది. సంజూ శాంసన్ డకౌట్ గా వెను దిరిగాడు. అయినా సరే.. భారత్ దూకుడు ఆగలేదు. ప్రతీ ఓవర్‌కు 15 పరుగుల చొప్పున సాధించుకొంటూ వెళ్లింది. అందుకే కేవలం పది ఓవర్లలోనే మ్యాచ్ పూర్తి చేయగలిగింది.