ఆంధ్రజ్యోతి అంటే జగన్‌కు పడదు. ఆ విషయం ఆయనే బయట ఎక్కడ మైక్ అందుకున్నా చెబుతూంటారు. అందుకే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఒక్క రూపాయి ప్రకటన ఇవ్వకుండా కట్టడి చేశారు. ఆ పత్రిక కొనుగోలు ఏ ప్రభుత్వ ఆఫీసులో లేకుండా చేశారు. అయితే తప్పనిసరిగా ఆయన చేస్తున్న అప్పులతో ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనల ఆదాయం వస్తోంది. ఇది ఆయన ఊహించని మార్గం నుంచి వస్తోంది.
ఏపీ ప్రభుత్వానికి ప్రతి మంగళవారం పండుగ రోజు. అంటే ఆర్బీఐ నుంచి రూ. రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకోగలిగిన రోజు. ఈ సందర్భంగా ఆర్బీఐకి ముందే ఇండెంట్ పెడుతుంది. ఆ మేరకు బాండ్లు వేలం వేస్తామని చెబుతుంది. ఆర్బీఐ పత్రికల్లో ఇలా ఏపీ ప్రభుత్వం బాండ్లు వేలం వేస్తుందని ప్రకటన ఇస్తుంది. ఈ ప్రకటన తెలుగు పత్రికల్లో ఆంధ్రజ్యోతిలోనే వస్తుంది. జగన్ ప్రభుత్వం అప్పులు చేసేస్తోందని ఆంధ్రజ్యోతి తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది. చివరికి ఆ పత్రికలోనే అప్పులకు వెళ్తున్నట్లుగా ఆర్బీఐ ప్రకటన కూడా ఆర్బీఐ ఇస్తుంది. దీంతో ఆంధ్రజ్యోతికి రెండు వైపులా లాభం కనిపిస్తోంది.
అయితే ఈ ప్రకటనలు వద్దు అని ఆర్బీఐకి ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకంటే సీఎం అయినంత మాత్రాన ఆర్బీఐ ఎవరికి ప్రకటనలు ఇవ్వాలో ఇవ్వకూదదో చెప్పలేరు. అప్పులు తీసుకోవడం మానేస్తే అసలు ప్రకటనలే ఇవ్వరు కదా అని పరిష్కారం దొరకవచ్చు. కానీ ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. అసలు అప్పులు తీసుకోకపోతే రోజు గడిచేదెలా ? అందుకే ఈ విషయంలో జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆంధ్రజ్యోతికి జగన్ వల్ల ఇలాగైనా కాస్త ఆదాయం వస్తోంది.